ఆడపిల్లంటే ‘ఆడ’ పిల్లని, మగపిల్లాడంటే ‘మన’ పిల్లాడనే భావన ఉన్నంత వరకు ఈ సమాజంలో ఆడ పిల్లలకు స్థానం లేదుకావొ చ్చేమో.. ప్రాణం పోయాల్సిన వైద్యులే కడుపులోనే చంపేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్లని తెలిస్తే గర్భవిచిత్తి చేస్తున్నారు. – సాక్షి, వరంగల్
గర్భస్త లింగ నిర్ధారణ నేరం... అంటూ ఆస్పత్రుల్లో పెద్దపెద్ద బోర్డులు పెడుతున్న వైద్యులే... పైసల కోసం ‘పాప’ం చేస్తున్నారు. గతంలో గర్భవిచిత్తి ఉదంతాలు వెలుగులోకి వచ్చినా... కొందరు వైద్యుల తీరు ఏమాత్రం మారడం లేదు. వరంగల్ నగరంతో పాటు నర్సంపేట పట్టణం, నెక్కొండ ఇలా చాలా ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా అమ్మ కడుపులోని పాపలను భ్రూణహత్యలు చేస్తున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.
గర్భంలో ఉన్న శిశువు ఆడనా, మగనా అని తెలుసుకునేందుకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు ఆడపిల్ల అయితే గర్భవిచిత్తి చేస్తున్న కేసుల్లో సంబంధమున్న 18 మంది నిందితులను వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో గర్భస్రావానికి రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది.
హనుమకొండలోని లోటస్, గాయత్రి ఆస్పత్రులతో పా టు నర్సంపేటలోని బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, నెక్కొండలోని ఉపేందర్ క్లినిక్‌లు వీటిలో భాగస్వామ్యం అయ్యాయని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించడంతో వరంగల్ సిటీతో పాటు జిల్లాలోని ఆస్పత్రుల వ్యవహార శైలిపై అనుమానాలు వస్తున్నాయి. పోలీసులు ఇంకా లోతైన విచారణ చేస్తే మరిన్ని ఆస్పత్రులు, క్లినిక్‌లపై క్రిమినల్ కేసులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆడపిల్ల అని తెలుసుకోవడానికి వచ్చినా, అబార్షన్ చేయాలన్న వైద్యులు నిరాకరించాల్సి ఉన్నా కాసుల కక్కుర్తి కోసం ప్రోత్సహిస్తుండడం గమనార్హం.
అయినా.. మారలే..
► నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామ శివారు మాలోతు నంద్యానాయక్‌తండాలోని ప్రశాంత్.. పార్థు నర్సింగ్ హోంలో తన భార్యకు జన్మించిన ఆడ శిశువును రూ.25వేలకు ఆస్పత్రి సిబ్బంది సహకారంతో హనుమకొండలోని విజయ్‌కుమార్, రజనీ దంపతులకు విక్రయించారు. ఈ విషయం బాలల సంరక్షణ విభాగాధికారుల దృష్టికి వెళ్లగా.. 2020 ఏప్రిల్ 25న నెక్కొండ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్ పార్థు, డాక్టర్ ఉపేందర్, స్టాఫ్ నర్సు పద్మ, శిశువు తండ్రి ప్రశాంత్, నాయనమ్మ నర్సమ్మలపై కేసు నమోదు చేశారు. ఎట్టకేలకు 2020 మే 5న పాప జాడ దొరికింది.
అంతకుముందు 2011జూలై 22న కవల పిల్లల విక్రయాల కేసులోనూ ఈ ఆస్పత్రి వివాదానికి కేరాఫ్‌గా నిలిచింది. ఈ రెండు ఘటనల తర్వాత పార్థు నర్సింగ్ హోం పేరును ఉపేందర్ క్లినిక్‌గా మార్చుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈసారి లింగనిర్ధారణ పరీక్షలు చేసి గర్భవిచిత్తు చేస్తున్నారని ఉపేందర్ క్లినిక్‌లోని రెండు స్కానింగ్ మెషీన్‌లను ఇప్పటికే వైద్యారోగ్యవిభాగాధికారులు సీజ్ చేశారు. ఇవి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఎక్కడి నుంచి తెప్పించారనే దిశగా విచారణ చేస్తున్నారు. అయితే సీపీ రంగనాథ్ ఆదేశాల మేరకు కమలాపురం సీఐ సంజీవ్, నెక్కొండ ఎస్సై జానీ పాషా, గ్రామ కార్యదర్శి సదానందం, రెవెన్యూ సిబ్బందితో కలిసి తనిఖీ చేసి రికార్డులు, గదులను పరిశీలించారు. ఇప్పటికే డాక్టర్ బాల్నె పార్థు, పార్థు భార్య ఆశలత, కాంపౌండర్ కీర్తి మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
► దాదాపు ఏడాది క్రితం ప్రారంభమైన నర్సంపేటలోని బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లోనూ లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు గర్భ విచిత్తి జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నెల 13న అక్కడి స్కానింగ్ మెషీన్‌ను వైద్యారోగ్యవిభాగాధికారులు సీజ్ చేశారు.
ఇవన్నీ పకడ్బందీగా చేస్తేనే...
► గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గర్భం దాల్చిన వారి వివరాలను వైద్యారోగ్య శాఖ సిబ్బంది సమగ్రంగా సేకరించాలి. గుర్తించిన గర్భిణుల సంఖ్యను... ప్రసవాలతో పోలిస్తే గర్భస్రావాలు...గర్భవిచిత్తి ఉదంతాలు బయటపడే అవకాశముంది. ఈ దిశగా యంత్రాంగం దృష్టి సారించాలి.
► ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలకు వస్తున్న గర్భిణుల వివరాలు నమోదు చేయించి. ఆ వివరాలను ప్రసవాల సంఖ్యతో సరిపోల్చడం ద్వారా ఎక్కడైనా అక్రమాలు జరిగితే గుర్తించవచ్చు.
► వైద్యారోగ్యశాఖ అధికారులు స్కానింగ్ కేంద్రాలు తరచుగా తనిఖీ చేయకపోవడంతో రహస్యంగా లింగనిర్ధారణ, భ్రూణహత్యలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
► జిల్లా పరిధిలో కలెక్టర్ అధ్యక్షతన లింగ నిర్ధారణ నిరోధక కమిటీ ఏర్పాటై ఉంటుంది. పోలీసు కమిషనర్, న్యాయమూర్తి, డీఎంహెచ్‌ఓ, స్వ చ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. కనీసం ఆరునెలలకోమారు ఈ కమిటీ సమావేశం జరగాలి. తీసుకుంటున్న చర్యలపై సమీ క్షించాలి. ఆ దిశగా కసరత్తు జరగాలి.
Comments
Please login to add a commentAdd a comment