సాక్షి, వరంగల్: ‘చట్టసభల్లో రిజర్వేషన్‌తో అవకాశం కల్పిస్తే మేము రాజకీయంగా నిరూపించుకుంటూ.. సమాజానికి సేవ చేస్తాం’ అంటున్నారు.. రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్త, ట్రాన్స్‌జెండర్ లైలా. తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్ లైలా ఎంపికయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,600 మందికిపైగా ఉన్న ట్రాన్స్‌జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ట్రాన్స్ జెండర్ సంక్షేమ బోర్డు సభ్యురాలిగా కూడా ఉన్న లైలాతో ‘సాక్షి’ బుధవారం ముచ్చటించింది. వివరాలు ఆమె మాటల్లోనే..
సంఖ్య పెరిగితే ప్రత్యేక పథకాలు..
రాష్ట్రంలో ఉన్న మా కమ్యూనిటీ సమస్యలపై అవగాహన ఉంది. లక్ష వరకు మా సంఖ్య ఉన్నా.. ఓటరు జాబితాలో మాత్రం 2,033 మందే కనిపిస్తున్నారు. చాలామంది మేల్, ఫిమేల్‌గా నమోదు చేసుకున్నారు. అందుకే మా సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. మా మీద ఉన్న వివక్షతో కొంత మంది ట్రాన్స్‌జెండర్‌గా ఓటర్‌గా నమోదు చేసుకోవడం లేదు. గుర్తింపు, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో బయటకు చెప్పుకునేందుకు ఇష్టపడడం లేదు. 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కొంతమంది ధైర్యంగా ముందుకొచ్చి అదర్స్.. థర్డ్ జెండర్.. అనే కాలమ్‌లో ఓటరుగా నమోదు చేసుకున్నారు. మేమంతా 18 ఏళ్లు నిండిన వాళ్లమే. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా నా వంతు పాత్ర నిర్వర్తిస్తా. అప్పుడే ప్రభుత్వాలు మాకు ప్రత్యేక పథకాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.
బాధ్యతగా భావిస్తున్నా..
గొప్ప గొప్ప సెలబ్రిటీలు, హీరో హీరోయిన్లను ఎన్నికల ప్రచార కర్తలుగా తీసుకుంటున్న తరుణంలో ఓ ట్రాన్స్‌జెండర్ అయిన నన్ను ఓ ఐకాన్‌గా తీసుకోవడం అరుదైన అవకాశంగా.. గొప్ప బాధ్యతగా భావిస్తున్నా. ఇంత గుర్తింపునిచ్చిన ఎన్నికల కమిషన్‌కు ధన్యవాదాలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పోరాటాలు చేసి చాలావరకు సాధించుకున్నాం.. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త గుర్తింపు పెరిగింది.
అధికారులు.. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల్లో ట్రాన్స్‌జెండర్స్‌పై అవగాహన పెరిగింది. కానీ, మార్పు రావాలంటే ప్రభుత్వాలు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి. అవకాశాలు ఇవ్వాలి. ప్రత్యేక గుర్తింపును ఇచ్చినప్పుడు మాత్రమే మరింత ముందుకెళ్లే.. అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ల వల్లనే ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. విద్య, ఉద్యోగం, వైద్యం, రాజకీయ రంగాల్లో కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చి ప్రోత్సహించాలి..
అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా..
అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా నిరూపించుకుంటాం.. అవకాశం ఏ రాజకీయ పార్టీ ఇచ్చినా.. చట్టసభల్లో ఉండాలని కోరుకుంటాం. మాకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే చట్టసభల్లో మాత్రమే మన పాలసీలు, జీఓలు వస్తుంటాయి. ఎక్కడైతే పాలసీలు తయారవుతున్నాయో అక్కడ మా వాయిస్ ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అవకాశం ఇచ్చినా.. మా కమ్యూనిటీ ఉపయోగించుకుంటుంది.
మాకు అది అవసరం కూడా.. అదే సమయంలో ఎన్నికల ప్రచార కర్తగా ప్రతి ఒక్క అర్హులు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తా.. ఓటును వినియోగించడం ద్వారా సరైన సేవ చేసే వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని విడమరిచి చెబుతా. ఓటు గొప్ప ఆయుధం కాబట్టి ఓట్లు వేసే రోజు పోలింగ్ బూత్‌కు వెళ్లాలి. అప్పుడే సరైన ప్రజాస్వామ్యాన్ని, నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. సరైన నాయకుడు వస్తేనే మన జీవితాల్లో మార్పు వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment