హన్మకొండ: సహకార సేవలను ప్రజలకు, రైతులకు మరింత చేరువ చేసేందుకు, సేవలను వారి ముంగిట్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రంలో నూతన సహకార సంఘాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. సహకార సంఘాలను బలోపేతం చేయడంతో పాటు సేవలు విస్తృతం చేయడంలో భాగంగా నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలానికి ఒకే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాత్రమే ఉండడంతో మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాలు సేవలు అందుకోలేకపోతున్నాయి. సొసైటీ ద్వారా సేవలు పొందవచ్చనే అవగాహన కొందరు రైతులకు లేదు. ఈక్రమంలో రైతులకు సహకార సేవల్ని చేరువ చేసేందుకు కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకుంది. దీంతో పాటు రాష్ట్రంలో జిల్లా, మండలాల పునర్విభజనతో కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. వీటితో పాటు పెద్ద సంఘాలను పునర్వవ్యవస్థీకరించాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో కొత్త పీఏసీఎస్‌లు ఏర్పాటు కానున్నాయి.
మల్టీపర్పస్..
ప్రభుత్వం జిల్లాల నుంచి ప్రతిపాదనలు కోరగా.. జిల్లా సహకార అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ప్రాథమిక సహకార సంఘాలు కేవలం రుణ వితరణ, ఎరువుల వ్యాపారాలకే పరిమితం అవుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే సహకార సంఘాలు మల్టీపర్పస్ సహకార సంఘాలుగా ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలిచే సహకార సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కామన్ సర్వీస్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తుంది. కాగా.. హనుమకొండ జిల్లాలో ప్రస్తుతం 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలుండగా.. మరో 8 సంఘాలు పెంచుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటితో మొత్తం పీఏసీఎస్‌ల సంఖ్య 24కు చేరనుంది. వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 28 ప్రాథమిక సహకార సంఘాలుండగా.. కొత్తగా 6 సంఘాలు పెంచేందుకు ప్రతిపాదనలు పంపారు. వీటితో మొత్తం 34కు చేరనుంది. గత ప్రభుత్వం ప్రతిపాదనలు స్వీకరించి నప్పటికీ ఏర్పాటు చేయలేదు.
రైతుకు లాభమేంటంటే..
సహకార సంఘాల ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద నాబార్డు, రాష్ట్ర సహకార బ్యాంకు ద్వారా అతి తక్కువ వడ్డీ 4 శాతానికి రుణాలు అందిస్తోంది. ఈరుణాల ద్వారా సంఘాల్లోని గోదాంలు, కోల్డ్ స్టోరేజీ, డీజిల్–పెట్రోల్ బంక్‌ల ఏర్పాటు, మినీ రైస్ మిల్ నిర్మాణం, వ్యవసాయ సేవా కేంద్రాలు, అగ్రికల్చర్ ఔట్‌లెట్లు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, సూపర్ మార్కెట్ల ఏర్పాటుతో పాటు ఆదాయం రాబట్టుకునే వ్యాపారాలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈక్రమంలో కొత్త సంఘాల రైతులకు రుణాలు ఇవ్వడం, ఎరువుల వ్యాపారానికే పరిమితమవకుండా బహుళార్థక సేవా కేంద్రాలుగా ఏర్పాటు చేయనున్నారు.
వరంగల్ జిల్లాలో 6, హనుమకొండలో 8
ప్రతిపాదనలు పంపిన అధికారులు
రైతులకు మరింత చేరువకానున్న
సహకార సంఘాలు
హనుమకొండ జిల్లాలో..
ప్రస్తుత పీఏసీఎస్ ప్రతిపాదిత పీఏసీఎస్
ధర్మసాగర్ వేలేరు
కమలాపూర్ మర్రిపల్లిగూడెం, శనిగరం
ఎల్కతుర్తి తిమ్మాపూర్, భీమదేవరపల్లి
శాయంపేట ప్రగతి సింగారం
పెద్దాపూర్ ఊరుగొండ, దామెర
వరంగల్ జిల్లాలో ప్రతిపాదిత నూతన పీఏసీఎస్‌లు
ప్రస్తుత పీఏసీఎస్ ప్రతిపాదిత పీఏసీఎస్‌లు
రాయపర్తి పెర్కవేడు
వర్ధన్నపేట ఉప్పరపల్లి
ఖానాపురం బుధరావుపేట
నల్లబెల్లి మేడపల్లి
నర్సంపేట కమ్మపల్లి
చౌటుపల్లి ఏనుగల్లు
Comments
Please login to add a commentAdd a comment