కోళ్ల వ్యర్థం.. రూ.కోట్ల వ్యాపారం
వరంగల్ అర్బన్ : కోళ్ల వ్యర్థాలే కదా అని తీసిపారేయకండి. ఆ వ్యర్థాలే కాంట్రాక్టర్‌కు రూ.కోట్లు కురిపిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ నగరంలో సుమారు 1,500కు పైగా చికెన్ సెంటర్లు ఉన్నాయి. ఇక కాలనీల్లో చిన్నా, చితకా 500కుపైనే ఉంటాయి. ఈ చికెన్ సెంటర్ల నుంచి ప్రతిరోజూ సుమారు 4వేల నుంచి 5వేల కిలోల వరకు వ్యర్థాలు ఉత్పన్నమవుతాయి. గతంలో వ్యర్థాలను బయట పోసేందుకు చికెన్ సెంటర్ల యజమానులు అష్టకష్టాలు పడేవారు. కొన్నేళ్లుగా ఆ వ్యర్థాలకు డిమాండ్ పెరిగింది. కోళ్లదాణా, చేపల చెరువులకు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బల్దియా ఆధ్వర్యంలో సేకరించేందుకు టెండర్ నిర్వహించారు. అందులో టెండర్ దక్కించుకున్న వ్యక్తి ఉచితంగా వ్యర్థాలు సేకరించి బయటి మార్కెట్‌లో విక్రయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కిలో వ్యర్థానికి రూ.20 చొప్పున ధర పలుకుతుంది. ఇలా నగరంలో రోజుకు రూ.2.50లక్షల నుంచి రూ.3లక్షల వ్యాపారం సాగుతోంది. ప్రతిఏటా కోళ్ల వ్యర్థాల వ్యాపారం రూ.2.50 కోట్ల నుంచి 3.10కోట్ల వరకు వ్యాపారం సాగుతుంటుంది. ప్రతీ శనివారం, సోమవారం, గురువారం విధిగా కాంట్రాక్టర్లు చికెన్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. చికెన్ సెంటర్ల యజమానులు వ్యర్థాల సేకరణ నిమిత్తం బల్దియాకు యూ జర్‌చార్జీలు చెల్లిస్తారు. కానీ కాంట్రాక్టర్ నెలనెలా వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని దుకాణాల్లో సేకరించట్లేదు. దీంతో దుర్వాసన భరించలేక కాంట్రాక్టర్ అడిగినంత ఇచ్చుకుంటున్నారు.
పేరుకే టెండర్.. అంతా మామూళ్ల వ్యవహారం
కోళ్లవ్యర్థాల తరలింపునకు టెండర్ నిమిత మాత్రమే. కానీ పెద్దఎత్తున చేతులు మారుతున్నాయి. బల్దియాకు ప్రతినెలా రూ.70వేలు స దరు కాంట్రాక్టర్ చెల్లిస్తున్నారు. కానీ సదరు కాంట్రాక్టర్ 2వేలకు పైగా ఉన్న చికెన్ సెంటర్ నిర్వహకుల వ్యర్థాల తరలింపు పేరిట నెలకు రూ.300 నుంచి రూ. 500 వరకు ప్రతీషాపునుంచి వసూలు చేస్తున్నాడు. అంతేకాకుండా చికెన్ వ్యర్థాలను తిరిగి కోళ్ల దాణ చేపల చెరువులకు తరలిస్తూ రూ.కోట్లు సమకూర్చుకుంటున్నారు. మరికొద్ది నెలల్లో టెండర్ గడువు ముగియనుండడంతో కాంట్రాక్టర్లు ఓ మంత్రి ద్వారా తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
నగరంలోని చికెన్ సెంటర్లనుంచి ప్రతినెలా వసూళ్లు
చేతులు మారుతున్న లక్షలు
‘గ్రేటర్’కు నామమాత్రంగా చెల్లింపు
మరికొద్ది నెలల్లో ముగియనున్న
టెండర్ గడువు
తిరిగి దక్కించుకునేందుకు పోటాపోటీ
Comments
Please login to add a commentAdd a comment