గీసుకొండ: కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరలో ఆదివారం తప్పిపోయిన బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ రంగశాయిపేటకు చెందిన కేడల సురేశ్ తన కుటుంబంతో జాతరకు వచ్చాడు. షాపింగ్ చేస్తున్న క్రమంలో ఆయన మూడేళ్ల కుమారుడు జస్విత్‌చంద్ర తప్పిపోయాడు. తమ కుమారుడు తప్పిపోయాడని తల్లిదండ్రులు సమాచారం ఇవ్వడంతో గీసుకొండ ఇన్‌స్పెక్టర్ మహేందర్ వెంటనే స్పందించారు. ఎస్సై కుమార్‌తో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి బాలుడి ఆచూకీ తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. గీసుకొండ ఇన్‌స్పెక్టర్, ఎస్సై, సిబ్బందికి బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఐదేళ్ల క్రితం తప్పిపోయిన
బాలుడి ఆచూకీ లేదు
రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వాల్ జిల్లా రేణి గ్రామానికి చెందిన కొందరు ఆట వస్తువులు అమ్ముకోవడానికి 2020 మార్చిలో కొమ్మాల జాతరకు వచ్చారు. వారిలో భగర్య ధర్మవీర్–సీత దంపతుల కుమారుడు ప్రదీప్(6) జాతరలో ఆడుకుంటూ వెళ్లి తప్పిపోయాడు. అతడి ఆచూకీ కోసం పోలీస్‌శాఖ చేయ ని ప్రయత్నం లేదు. బస్సులకు, పలు ప్రాంతాల్లో గోడలకు పోస్టర్లు అంటించి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించింది. జాడ చూపిన వారికి రూ.లక్ష నగదు బహుమతి ఇస్తామని అప్పటి ఏసీపీ నరేశ్‌కుమార్ ప్రకటించారు. అయినా బాలుడు ప్రదీప్ ఆచూకీ నేటికీ లభించలేదు.