ఇప్పటి వరకు పదికిపైగా మోటార్ల అపహరణ
కమలాపూర్: కమలాపూర్‌లో వ్యవసాయ విద్యుత్ మోటార్ల వరుస చోరీలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ఏడాది కాలంలో సుమారు 10కి పైగా వ్యవసాయ మోటార్లు అపహరణకు గురయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం శివారులో హుజూరాబాద్–పరకాల ప్రధాన రహదారిని అనుకుని ఉన్న ఎస్సారెస్పీ డీబీఎం–20 కాల్వలో అమర్చుకున్న వ్యవసాయ విద్యుత్ మోటారును ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. తెల్లారి వెళ్లేసరికి కాల్వ వద్ద విద్యుత్ మోటారు లేదని బాధిత రైతు పుల్ల రాజు తెలిపారు. కాగా.. కమలాపూర్‌కు చెందిన పలువురు రైతులు ఎస్సారెస్పీ కాల్వకు విద్యుత్ మోటార్లు అమర్చుకుని పంటలకు సాగు నీరు అందించుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు. ఈక్రమంలోనే సాగు నీటి కోసం కాల్వ వద్ద అమర్చుకున్న విద్యుత్ మోటార్లను కొంతకాలంగా గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్తున్నారు. ఇలా ఏడాది వ్యవధిలో సుమారు 10కి పైగా వ్యవసాయ మోటార్లు చోరీకి గురయ్యాయని, అందులో పుల్ల రాజు అనే రైతుకు చెందినవే ఏడు ఉన్నాయని, అందులో ఈ ఒక్క నెలలోనే 2 చోరీకి గురైనట్లు తెలిపారు. కాగా.. కాల్వ వెంట అమర్చిన వ్యవసాయ విద్యుత్ మోటార్లను గుర్తు తెలియని దుండగులు రాత్రి వేళల్లో అపహరించుకు వెళ్తున్నారని, మరికొన్నింటిని అక్కడే పగులగొట్టి అందులోని కాపర్ వైరు ఎత్తుకెళ్తున్నారని, దీంతో తమకు వేలాది రూపాయల్లో నష్టం వాటిల్లుతోందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోటార్ల చోరీపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పోలీసులు రాత్రి సమయాల్లో కాల్వ వెంట పెట్రోలింగ్ ముమ్మరం చేసి మోటార్ల దొంగలను పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.