సాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్: అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధీర్, ఎల్లన్న, సుధాకర్.. హనుమకొండ జిల్లా తరాలపల్లి ముద్దుబిడ్డ.. రెండు పదుల వయస్సులో ఆయిడిసి, బాయిడిసి అ డవిబాట పట్టిన మావోయిస్టు నేత. దళసభ్యుడినుంచి దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడి వరకు ఎదిగిన సారయ్య అలియాస్ సుధీర్ 35 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. దంతెవాడ జిల్లా బీజాపూర్ ప్రాంతంలోని గీడం పోలీస్‌స్టేషన్ పరిధి లోని గిర్సాపర, నెల్గోడ, బోడ్గా, ఇకెలి గ్రామాల సరి హద్దు ప్రాంతాల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు ఎస్పీ గౌరవ్‌రాయ్ మంగళవారం ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం ముగ్గురు మృతిచెందగా.. మృతుల్లో సారయ్య ఉన్నట్లు వెల్లడించారు. బీజాపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సారయ్య మృతి చెందాడన్న వార్తతో తరాలపల్లిలో విషాధఛాయలు అలుముకున్నాయి.
విద్యార్థిదశ నుంచే ఉద్యమాలు..
తరాలపల్లి గ్రామానికి చెందిన సారయ్య కొండపర్తి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. 1982లో 10వ తరగతి చదువుతున్న త రుణంలోనే నాడు మావోయిస్టులు ఇచ్చిన ‘గ్రామాలకు తరలండి’ పిలుపునకు ఆకర్షితుడై, తరాలపల్లి విలేజ్ ఆర్గనైజర్ బండి ఆశాలు, హనుమకొండ సిటీ ఆర్గనైజర్ తిప్పారపు రాములు అలియాస్ తాత సా రథ్యంలో తరాలపల్లి గ్రామ అధ్యక్షుడిగా తన ప్ర స్థానం ప్రారంభించాడు. అంచెలంచెలుగా మావో యిస్టు పార్టీలో ఎదుగుతున్న తరుణంలో 1990లో బీఎస్‌ఎఫ్ సిబ్బంది గ్రామాలోకి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 1993లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సిటీ ఆర్గనైజర్ తాత చనిపోవడంతో.. అజ్ఞాతంలోకి వెళ్లిన సారయ్య గ్రామానికి తిరిగి రాలేదు.
ముగిసిన 35 ఏళ్ల ప్రస్థానం...
సుమారు 35 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో తన ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించిన సారయ్య మంగళవారం ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు. హనుమకొండ, ఖమ్మం జిల్లాల్లో వివిధ స్థాయిల్లో పని చేసి 1995లో దండకారణ్యానికి వెళ్లిన ఆయన దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ఎదిగా రు. ప్రస్తుతం ఈస్ట్ బస్తర్ డీకేఎస్‌జడ్‌సీ సభ్యుడిగా, మాస్ మొబైల్ అకడమిక్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది.
అమరుల పల్లె తరాలపల్లి..
కాజీపేట మండలం తరాలపల్లి ఉద్యమాలకు కేరా ఫ్. ఎందరో ఈ గ్రామంనుంచి విప్లవోద్యమాల వైపు ఆకర్షితులై ఎన్‌కౌంటర్లలో అసువులు బాశారు. 1991లో వేల్పుల జగదీష్ అలియాస్ ఉప్పలన్న, 1992లో బండి ఆశాలు అలియాస్ శ్రీను పగిడేరు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. 1998 నుంచి గాజుల శ్రీకాంత్ అలియాస్ శ్రీనాథ్, ముప్పిడి నాగేశ్వర్‌రా వు అలియాస్ విశ్వనాథ్, చిరబోయిన సదానందం అలియాస్ కౌముదీ, సంపత్, కొత్తపల్లి సాంబయ్య అలియాస్ ఉప్పలన్నలు మృతిచెందగా.. మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అంకేశ్వరపు సారయ్య చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, నేడు (బుధవారం) సారయ్య మృతదేహం గ్రామానికి చేరనుంది.
35 ఏళ్ల అజ్ఞాతవాసం...
దళసభ్యుడినుంచి డీకేఎస్‌జడ్‌సీ వరకు..
దంతెవాడ ఎన్‌కౌంటర్‌లో
అసువులు బాసిన సుధీర్
విషాదంలో తరాలపల్లి..
నేడు గ్రామానికి మృతదేహం