సాక్షి, భీమవరం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా పదో తరగతి, ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. గత ప్రభుత్వాలు టెన్త్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే వారి అదృష్టం అన్నట్టు ఉండేది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యమివ్వడంతో సప్లిమెంటరీ పరీక్షలకు సైతం విద్యార్థులను సన్నద్ధం చేసేలా బడుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
లెక్కలపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో గత మార్చిలో నిర్వహించిన టెన్త్ పరీక్షల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 20,268 మంది పరీక్షలకు హాజరుకాగా 13,362 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 3,933 మంది బాలురు, 2,973 మంది బాలికలు ఫెయిల్ అయ్యారు. వీరికి వచ్చేనెల 2వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది లెక్కలు సబ్జెక్టులో ఫెయిల్ కాగా వారందరిపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఇంటర్‌లో.. ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఇంటర్మీడియెట్ కళాశాలల్లో కూడా ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని ఎంపిక చేసిన జిల్లాపరిషత్ హైస్కూళ్లలో బాలికల కోసం ఇంటర్ తరగతులు నిర్వహించారు. ఆయా కళాశాలల్లో సుమారు 150 మంది విద్యార్థినులు ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కాగా వారందరికీ ప్రత్యేక తరగతులు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.
389 పాఠశాలల్లో.. జిల్లాలోని 389 జిల్లాపరిషత్ హైస్కూళ్లలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యార్థులను చదివిస్తున్నారు. రోజుకు రెండు సబ్జెక్టుల చొప్పున తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు. విద్యార్థులు గతంలో ఫెయిల్ అవడానికి కారణాలను తెలుసుకుని ఉపాధ్యాయు లు దగ్గరుండి మరీ చదివిస్తూ జవాబులు రాసేటప్పుడు తప్పిదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. విద్యార్థులూ అంతే శ్రద్ధగా పాఠాలను అర్థం చేసుకుంటున్నారు. మొ త్తంగా నూరుశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయి.
భీమవరం పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూల్‌లో టెన్త్, రాయకుదురు హైస్కూల్‌లో ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న దృశ్యం
ప్రభుత్వ బడుల్లో ప్రత్యేక తరగతులు
6,906 మంది టెన్త్ విద్యార్థులకు శిక్షణ
నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
విద్యార్థులకు వరం
పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఓ వరం. విద్యార్థులు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. తాము కూడా తోటి విద్యార్థుల మాదిరి టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో చదువుతున్నారు. రోజుకు రెండు సబ్జెక్టుల్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు క్రమశిక్షణతో వారిని చదివిస్తున్నాం. ఇది వారికెంతో మేలు చేస్తుంది.
– ఆర్.వెంకటరమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment