
మట్టి మాఫియాతో సాగునీటికి అడ్డంకులు
పెంటపాడులో యంగం చెరువు ఆయకట్టు రైతుల ఆందోళన
భూమి పూడికకు అనుమతి లేదు
పట్టణంలో భీమవరం బైపాస్ రోడ్డులో జిరాయితీ భూమిని పూడుస్తున్నారు. ఈ భూమికి సంబంధించి భూ యజమానులు కన్వర్షన్ అనుమతి పొందలేదు. ఇలా చేయడం నేరం. మార్గదర్శకాల ప్రకారం పూడిక చేసుకుంటే జరిమానా చెల్లింపుతోపాటు, కన్వర్షన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంది. ఇలాంటి చర్యలను నిబంధనల మేరకు అడ్డుకుంటాం.
– సునీల్‌కుమార్, తహసీల్దార్, తాడేపల్లిగూడెం
●
తాడేపల్లిగూడెం: అధికారం ముసుగులో రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి 500 ఎకరాలను ఎండగట్టేందుకు కొందరు నేతలు సిద్ధమయ్యారు. పెంటపాడులో యంగం చెరువు ఆయకట్టు కింద సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రాన్ని ఆనుకొని వేసుకున్న గట్లు, ఉమ్మడి కళ్లాలు ఉన్నాయి. మిడ్ లెవల్ కాలువ నుంచి లో లెవల్ కాలువను అనుసంధానించడానికి ప్రధాన పంట బోదెలు పెంటపాడు నుంచి జట్లపాలెం వరకు ఉన్నాయి. ఈ ప్రధాన భూముల మీదుగా సాగు నీరు పంటబోదెల ద్వారా లో లెవల్ కాలువకు వెళ్తుంది. ఈ మార్గంలో సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. కొందరు స్వార్థపరులు అధికారం ముసుగులో మట్టి తవ్వకాలకు తెగబడ్డారు. నియోజకవర్గ మట్టి మాఫియా లీడర్ బుల్‌డోజర్లు, పొక్లెయిన్‌లు యథేచ్ఛగా మట్టిని తవ్వి పెంటపాడు నుంచి గూడెం పట్టణానికి తరలించారు. దీంతో ఈ తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు. తమ భూములకు సాగునీటి సరఫరాకు అడ్డంకులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత తెరపైకి వచ్చిన కూటమి నేత మట్టి తవ్వకాలను కొనసాగించాలని, యంత్రాలను సీజ్ చేయకుండా మంతనాలు సాగించినట్టు సమాచారం.
సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందించే పంట బోదెలు, సామూహిక కళ్లాలు, గట్లను విధ్వంసం చేసేలా సాగుతున్న మట్టి తవ్వకాల కారణంగా సాగునీరు అందకుండా పొలాలు బీడు వారే ప్రమాదం ఉంది. రెవిన్యూ అధికారులు తవ్వకాలను ఎందుకు ఎందుకు అడ్డుకోలేదు.. వాహన యజమానులపై ఎందుకు కేసు నమోదు చేయలేదన్నది ప్రశ్నార్థకం. ఈ వ్యవహారంపై పెంటపాడు సంగం మేడ వద్ద జరిగిన మంతనాలకు గూడెం జేఎస్పీ నేత వెళ్లారు. పెంటపాడు రెవెన్యూ అధికారి ఆరోగ్య పరమైన కారణాలతో సెలవు పెట్టి వెళ్లగా.. ఇన్‌చార్జిగా ఒక అధికారిని నియమించారు. దీని వెనుక పెద్ద తతంగా నడిచిందని సమాచారం. ఇన్‌చార్జి అధికారులు తూతూ మంత్రం చర్యలు చేపట్టి చేతులు దులుపుకున్నారు.

మట్టి మాఫియాతో సాగునీటికి అడ్డంకులు
Comments
Please login to add a commentAdd a comment