
యువత జీవితాలతో కూటమి చెలగాటం
తాడేపల్లిగూడెం అర్బన్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడంతో నిరుద్యోగులు, యువత, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెంలో క్యాంపు కార్యాలయంలో ఈనెల 12న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న యువత పోరు పోస్టర్లను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యాదీవెన పథకాలకు ప్రభుత్వం రూ.4,600 కోట్లు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని, నూతన మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రాలు అందిస్తామన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టగా మాజీ సీఎం జగన్ సమర్థవంతంగా అమలు చేశారన్నారు. 2024 డిసెంబరులో విద్యార్థులకు రూ.7,500 కోట్లు సిద్ధం చేయగా ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. సూపర్‌సిక్స్‌లో భాగంగా నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులకు రూ.7,600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా బడ్జెట్‌లో ఆ ఊసే లేదన్నారు. తల్లికి వందనం కింద రూ.12,500 కోట్లు అందించాల్సి ఉండగా బడ్జెట్‌లో రూ.8,500 కోట్లు కేటాయించడం సరికాదన్నారు. జగన్ ప్రభుత్వంలో 17 వైద్య కళాశాలలు ప్రారంభించేందుకు రూ.8 వేల కోట్లు కేటాయించారన్నారు. ఈ మేరకు రాష్ట్రానికి వచ్చిన 2,550 మెడికల్ సీట్ల కోటాను కూటమి ప్రభుత్వం అవసరం లేదని లేఖలు రాయడం స్వార్థ రాజకీయాలకు అద్దం పడుతుందన్నారు.
నియోజకవర్గంలో అసాంఘిక కార్యక్రమాలు
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రస్తుత ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వ అనుమతులు, లైసెన్సులు లేకుండా దాబాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పలు ప్రాంతాల్లో పేకాట స్థావరాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్నారు. పార్టీ నేతలు కర్రి భాస్కరరావు, బండారు నాగు, ముప్పిడి సంపత్‌కుమార్, చెన్నా జనార్దన్, భాస్కరరెడ్డి, జిడ్డు హరిబాబు, కళ్లేపల్లి కృష్ణంరాజు, వీరకుమార్, సూర్పని రామకృష్ణ, వెలిశెట్టి నరేంద్రకుమార్, అరిగెల అభి పాల్గొన్నారు.
మాజీ మంత్రులు కారుమూరి, కొట్టు
12న వైఎస్సార్‌సీపీ యువత పోరుకు సిద్ధం
కూటమివి వంచన మాటలు
తణుకు అర్బన్: అబద్ధం, వంచన, మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం విద్యార్థులు, యువత, నిరుద్యోగుల భవిష్యత్తును ముళ్లబాటగా మారుస్తుందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా పేద విద్యార్థులకు చదువును దూరం చేస్తున్నారన్నారు. దివంగత వైఎస్సార్ స్ఫూర్తితో మాజీ సీఎం జగన్ పేదల చదువులకు పెద్దపీట వేశారన్నారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతోపాటు నాడు–నేడుతో పాఠశాలల అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. అయితే సీఎం చంద్రబాబు వీటన్నింటినీ తుంగలో తొక్కి పేదలకు విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు అన్న మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. జగన్ ప్రభుత్వంలో తీసుకు వచ్చిన వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు.
యువత పోరుకు తరలిరండి
ఈనెల 12న కలెక్టరేట్ల వద్ద తలపెట్టిన వైఎస్సార్ సీపీ యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కారుమూరి కోరారు. అనంతరం యువత పోరు పోస్టర్లు ఆవిష్కరించారు. పార్టీ లీగల్ సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేష్, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ పాల్గొన్నారు.

యువత జీవితాలతో కూటమి చెలగాటం
Comments
Please login to add a commentAdd a comment