కోలుకుంటున్న కోడి
తణుకు అర్బన్ : బర్డ్‌ఫ్లూ వైరస్ కారణంగా సంక్షోభాన్ని చవిచూసిన పౌల్ట్రీ రంగం ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటోంది. గతనెలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి బాదంపూడి, తణుకు మండలం వేల్పూరు, పెరవలి మండలం కానూరు గ్రామాల్లో కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా రావడంతో ఆయా ప్రాంతాలకు 10 కిలోమీటర్ల మేర చికెన్, కోడిగుడ్లు అమ్మకాలపై నిషేధాజ్ఞలు విధించారు. అయితే బర్డ్‌ఫ్లూ సోకిన దానికంటే కూడా భయంకరంగా జరిగిన ప్రచారం కారణంగా కోళ్లు కొనుగోలు చేసే వారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోళ్లకు మేత వేయలేక కొన్ని ప్రాంతాల్లో ఉచితంగా కూడా పంపిణీ చేసినట్లుగా పౌల్ట్రీ ఫెడరేషన్ ఆవేదన వ్యక్తం చేశారు. బర్డ్‌ఫ్లూ మహమ్మారి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.100 కోట్లు నష్టపోయామని కేంద్ర పశుసంవర్థక శాఖ బృందానికి పౌల్ట్రీ ఫెడరేషన్ వినతిపత్రం అందజేసింది. తాజాగా బర్డ్‌ఫ్లూ వ్యవహారం తగ్గడంతో చికెన్ మేళాల నిర్వహణ తదితర కారణాలతో చికెన్ అమ్మకాలు కొద్దికొద్దిగా ఆశాజనకంగా మారుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
చికెన్ మేళాలకు ఆదరణ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పౌల్ట్రీ ఫెడరేషన్, జిల్లా కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల కొన్ని ప్రాంతాల్లో చికెన్, ఎగ్ మేళాలు నిర్వహించి ఉచితంగా చికెన్ వంటకాలను ప్రజలకు అందించారు. వీటిని భారీ ఎత్తున ప్రజలు ఆదరించారు. ముఖ్యంగా ఈనెల 5వ తేదీన పౌల్ట్రీ ఫెడరేషన్, పశ్చిమ గోదావరి జిల్లా కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తణుకు నెక్ కల్యాణ మండపంలో నిర్వహించిన చికెన్, ఎగ్ మేళాకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇక్కడ 10 వేల మందికి చికెన్, బిర్యానీ వంటకాలను సిద్ధం చేయగా సుమారుగా 13 వేల మందికిపైగా హాజరయ్యారు. మేళాకు హాజరైన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సైతం చికెన్ వంటకాలను వడ్డించి ఆమె స్వయంగా చికెన్ తిన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు పౌల్ట్రీ ఫెడరేషన్, కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తణుకు, వేల్పూరు, ఏలూరు, భీమవరం ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన చికెన్ మేళాలకు ప్రజలు భారీగానే తరలివచ్చారు.
జిల్లాలో 300 కోళ్ల ఫారాలు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బాయిలర్ కోళ్లకు సంబంధించి 300 ఫారాలు ఉండగా నిత్యం 22 టన్నులు (22వేలు కిలోలు) బాయిలర్, 15 టన్నులు (15వేల కిలోలు) లేయర్ మాంసం విక్రయాలు జరగ్గా బర్డ్‌ఫ్లూ అనంతరం కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం విధించిన ఆంక్షలు, అపోహల కారణంగా 20 శాతానికి అమ్మకాలు పడిపోయాయి. ఈనెల 1 నుంచి అమ్మకాలపై ఆంక్షలు తొలగించడంతో చికెన్ తినేందుకు ప్రజానీకం భయపడే పరిస్థితుల్లో తాజాగా చికెన్ మేళాల అనంతరం 50 శాతానికి అమ్మకాలు పెరిగాయని ఉగాది పండుగ వచ్చేసరికి నూరు శాతం అమ్మకాలకు చేరుకోగలమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోడిగుడ్లకు సంబంధించి సుమారు 200కు పైగా ఉన్న ఫారాల ద్వారా నిత్యం కోటి ఇరవై లక్షలు కోడిగుడ్లు రోజుకు ఉత్పత్తి చేసే సామర్థ్యం జిల్లాలో ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా పౌల్ట్రీ రంగానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెట్టింది పేరని రైతులు చెబుతున్నారు.
పెరుగుతున్న చికెన్, కోడిగుడ్ల అమ్మకాలు
జిల్లాలో సక్సెస్ అవుతున్న చికెన్ మేళాలు
20 నుంచి 50 శాతానికి పెరిగిన చికెన్ విక్రయాలు
చికెన్ మేళా సక్సెస్
తణుకు నెక్ కల్యాణ మండపంలో నిర్వహించిన చికెన్, ఎగ్ మేళా కార్యక్రమాన్ని ప్రజలు విశేషంగా ఆదరించారు. తక్కువ ధరకు అధిక ప్రొటీన్ పోషకాలు అందించే చికెన్, ఎగ్‌లను ప్రజలు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అపోహలు తొలగించేందుకే చికెన్ మేళాలు నిర్వహించాం.
– కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ చైర్మన్
పుంజుకున్న చికెన్ అమ్మకాలు
వైరస్ ప్రభావం తొలగడంతో ఈనెల 1వ తేదీ నుంచి చికెన్, కోడిగుడ్లు అమ్మకాలపై ఆంక్షలు తొలగించారు. వైరస్ భయంతో 20 శాతానికి పడిపోయిన చికెన్ అమ్మకాలు నేడు తిరిగి పుంజుకుని 50 శాతానికి పెరిగాయి. రానున్న రోజుల్లో వంద శాతానికి పెరుగుతాయి.
– డాక్టర్ కరణం శంకర్ భావనారాయణ, తణుకు మండల పశువైద్యాధికారి
కోలుకుంటున్న కోడి
కోలుకుంటున్న కోడి
Comments
Please login to add a commentAdd a comment