ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు
ద్వారకాతిరుమల: మండలంలోని జి.కొత్తపల్లి గ్రామంలో పచ్చ ముఠా అక్రమ గ్రావెల్ మట్టి తవ్వకాలు దర్జాగా సాగిస్తోంది. గత కొద్దిరోజులుగా టీడీపీ పెద్దల అండదండలతో ప్రభుత్వ భూముల్లో ఈ అక్రమ మట్టి తవ్వకాల దందా జోరుగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. అదే అదనుగా సదరు టీడీపీ నేతలు రెచ్చిపోయి మరీ రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. జేసీబీ సహాయంతో తవ్వకాలు జరిపి, టిప్పర్ల ద్వారా మట్టిని కామవరపుకోట, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. రియాల్టర్ల నుంచి కాంట్రాక్టులు పొంది మరీ ఈ దందాను దర్జాగా సాగిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ.5 వేలకు పైగా విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఎవరైనా ఈ అక్రమ తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే, వెంటనే మట్టి తవ్వకాలు ఆగిపోతున్నాయి. కొద్దిసేపటి తరువాత మళ్లీ దందా షరామామూలుగా సాగుతోంది. ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతుంటే కనీసం ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో అధికారులు పనిచేయడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
జి.కొత్తపల్లిలో దర్జాగా పచ్చ ముఠా దందా
రియల్ ఎస్టేట్ వెంచర్లకు టిప్పర్ల ద్వారా తరలిపోతున్న మట్టి
Comments
Please login to add a commentAdd a comment