
సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరుబాట
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యా రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. రెగ్యులర్ ఉద్యోగుల కంటే అధిక సమయం విధులు నిర్వహిస్తున్న వారి సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వ హయాంలో సమ్మె చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం వారి కోర్కెలను తీర్చడానికి ముందుకువచ్చింది. సమ్మె కాలంలో ఉద్యోగ సంఘాలతో ఒప్పందం చేసింది.
సమ్మె ఒప్పందాలు విస్మరించిన ప్రభుత్వం
సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్వహించిన సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఆ ఉద్యోగ సంఘంతో కొన్ని ఒప్పందాలు చేసింది. సమగ్ర శిక్షలోని 7 విభాగాల ఉద్యోగుల వేతనాన్ని 23 శాతానికి పెంచుతూ ఒప్పందం చేయడంతో పాటు అమలు కూడా ప్రారంభించింది. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) అమలు చేయడానికి కార్యనిర్వాహక కమిటీ ఎదుట ప్రతిపాదనలు ఉంచింది. ఉద్యోగుల జాబ్ చార్ట్‌ల కోసం కమిటీ ఏర్పాటుకు ఒప్పందం, కారుణ్య నియామకాలు చేపట్టడానికి ఒప్పందం, ప్రతీ నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి అంగీకారం వంటి ఒప్పందాలను చేశారు. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాల్లో కొన్ని ఆ ప్రభుత్వ హయాంలోనే అమలు చేయగా మరికొన్ని ఒప్పందాలను అమలు చేయడానికి ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సమగ్రశిక్ష ఉద్యోగులను పూర్తిగా విస్మరించింది.
ఉమ్మడి పశ్చిమలో 1500 మంది ఉద్యోగులు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో సమగ్రశిక్షలో 7 విభాగాల ఉద్యోగులు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. మొత్తం మీద సుమారు 1500 మంది ఉద్యోగులు ఆయా విభాగాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి కావా ల్సిన నిధులు అంచనా వేసి ప్రతిపాదనలు సిద్ధం చేయడం, విద్యార్థుల యూనిఫారం, షూ కొలతలు సేకరించి అంచనాలు సిద్ధం చేయడం, స్కూల్ బ్యాగ్‌లు పంపిణీ, పార్ట్ టైమ్ శిక్షకులుగా పూర్తిస్థాయిలో విధులు నిర్వహించడం ఇలా జిల్లాలో విద్యారంగం అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
ఇచ్చిన హామీ ఏమైంది?
తమతో చేసుకున్న అన్ని ఒప్పందాలను అమలు చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అడిగి అడిగి వేసారి పోయారు. తాము పోరాడి సాధించుకున్న హక్కులను అమలు చేసుకోవడానికి మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి రావడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో తాము చేసిన పోరాటాల సమయంలో తమ శిబిరాలకు వచ్చి మరీ మద్దతుగా నిలిచి, అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్లు సముచితమైనవేనని, తాము అధికారంలోకి వస్తే వారి డిమాండ్లు అన్నీ నెరవేర్చుతామని కూటమి నేతలు హామీలు ఇచ్చారు. ఇదంతా కేవలం అప్పటి ప్రభుత్వంపై బురద చల్లడానికి తమ శిబిరాలను వినియోగించుకోవడానికి మాత్రమేనని, తమపై ప్రేమతో కాదని ఇప్పుడు అర్థం అవుతోందని చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుని ఉండి ఉంటే తమకు ఈ తిప్పలు తప్పేవని ఆయా ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు.
సమ్మె ఒప్పందాలు
అమలు చేయకపోవడంపై ఆగ్రహం
నిరసన దీక్షకు తరలి రావాలి
సమ్మె ఒప్పందాలను అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 11న విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న నిరసన దీక్షకు ఉద్యోగులంతా తరలిరావాలి. ప్రతీ నెలా 1వ తేదీనే జీతాలు విడుదల చేయాలి. మినిమం టైమ్‌స్కేల్ అమలు చేయాలి. పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలి. సమగ్రశిక్ష ప్రాజెక్టు ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి.
వాసా శ్రీనివాసరావు, పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్స్ రాష్ట్ర అధ్యక్షుడు
హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలి
సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే హెచ్‌ఆర్ పాలసీని ఒప్పందం మేరకు కచ్చితంగా అమలు చేయాలి. ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ నెంబర్ –2ను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలి.
కే వినోద్ కుమార్, సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు

సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరుబాట

సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరుబాట
Comments
Please login to add a commentAdd a comment