
అర్జీలు నాణ్యతతో పరిష్కరించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజలు అందజేసిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రతి అర్జీని పరిశీలించి ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు. సంబంధిత ఆర్డీఓలు వారి పరిధిలోని మండలాలలో పర్యటించి ఎండార్స్‌మెంట్లను పరిశీలించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారుల నుంచి 367 అర్జీలు స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మొగిలి వెంకటేశ్వర్లు, వార్డు సచివాలయం అధికారి వై.దోసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సైబర్ మోసంపై కేసు నమోదు
ఉంగుటూరు: నారాయణపురంలోని ఒక షాపులో యువకుడు ఫోన్ పే పేరుతో రూ. 98 వేలు తన ఖాతాలోకి మళ్లించుకున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2,800 బిల్లు చేసిన ఆ యువకుడు ఫోన్ పే చేస్తానని చెప్పి షాపు యజమాని ఫోను రూ.1 ఫోన్ పే చేయమన్నాడు. యజమాని రూపాయి ఫోన్ పే చేశాడు. ఆ యువకుడు ఇప్పుడే వస్తానని బయటకు వెళ్ళాడు. వెంటనే షాపు ఓనరు బ్యాంకు ఖాతా నుంచి రూ.98 వేలు డెబిట్ అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. మోసపోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చిన వెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల కృష్ణారావు సోమవారం సందర్శించారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు తూర్పురాజగోపురం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో న్యాయమూర్తికి అర్చకులు, పండితులు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ డీఈఓ బాబురావు స్వామివారి మెమెంటో, ప్రసాదాలు అందజేశారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
భీమవరం: భీమవరం ఒకటో పట్టణం విస్సాకోడేరు వంతెన సమీపంలో లారీ ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మృతురాలిని పాలకొల్లు వాసిగా గుర్తించామన్నారు.
బంగారం, వెండి చోరీ
ఆగిరిపల్లి: ఇంటి తాళం పగులగొట్టి దొంగలు బంగారం, వెండి, నగదు చోరీ చేశారు. ఆగిరిపల్లి గౌడ బజార్‌కు చెందిన పల్లగాని రాంబాబు కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం బంధువుల ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి రాగా తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 40 తులాల వెండి, నాలుగు బంగారం ఉంగరాలు, రూ.3,500 నగదు చోరీ చేశారు.

అర్జీలు నాణ్యతతో పరిష్కరించాలి
Comments
Please login to add a commentAdd a comment