
పోలవరం నిర్వాసితుల ధర్నా
పోలవరం రూరల్: 18 ఏళ్లు నిండిన యువతకు, మహిళ వివాహితులకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింప చేయాలని ఆదివాసి మహాసభ అధ్యక్షుడు మిడియం వెంకటస్వామి, అడ్వకేట్ బాబ్జీ డిమాండ్ చేశారు. సోమవారం పోలవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలోని కోండ్రుకోట, కోరుటూరు, తూటిగుంట పంచాయతీలకు చెందిన మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మిడియం వెంకటస్వామి, అడ్వకేట్ బాబ్జీ మాట్లాడుతూ మండలంలో మొత్తం 29 గ్రామాలు పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్నాయన్నారు. ఎగువ ఏజెన్సీలో 19 గిరిజన గ్రామాల నిర్వాసితులు ప్యాకేజీలు ఇవ్వకపోయినప్పటికీ గోదావరి వరదలకు భయపడి 2022లో గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాస గ్రామాలకు తరలి వెళ్లారన్నారు. కటాఫ్ డేట్ పేరుతో నిర్వాసితుల పేర్లు తొలగించి, అసలు నిర్వాసితులు కాని వారికి, నిర్వాసిత గ్రామాలతో సంబంధం లేని వారి పేర్లు నమోదు చేసి ఇష్టారాజ్యంగా ప్యాకేజీలను ధారాదత్తం చేశారని ఆరోపించారు. ఇప్పటికై నా అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వివాహం అయిన పురుషులకు ప్యాకేజీ ఇచ్చినట్లు సీ్త్రలకు ఇవ్వాలన్నారు. అనంతరం పోలవరం తహసిల్దార్ సాయిరాజుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో తెలిపేటి మహేశ్వరి, పుట్టి సృజన, కొనుతుల మహేశ్వరి, అరగంటి అఖిల, తొర్లపాటి లక్ష్మి, మాడే అలేఖ్య, తెలిపేటి సందీప్ రెడ్డి, ఆకుల మౌనిక, నిర్వాసిత మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment