
ఆప్కాస్ రద్దును విరమించుకోవాలి
ఏలూరు(టూటౌన్): ఆప్కాస్‌ను రద్దు చేసి మున్సిపల్ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టే చర్యలను ఉపసంహరించుకోవాలని, మున్సిపల్ ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్–ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులకు ఎంతో కొంత ఉపశమనంగా ఉన్న ఆప్కాస్‌ను రద్దుచేసి మున్సిపల్ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు, కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం అంటే వెట్టిచాకిరిలోకి, బానిసత్వంలోకి నెట్టి వేయడమేనని విమర్శించారు. ప్రైవేటు ఏజెన్సీలకు ఇస్తే పిఎఫ్, ఈఎస్‌ఐలకు, కనీస వేతనాలకు గ్యారెంటీ ఉండదని ఆందోళన వ్యక్తి చేశారు. గత ప్రభుత్వం 17 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడం అన్యాయం అన్నారు. ఎక్స్‌గ్రేషియా పెంచడం, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచడం, ఇంజనీరింగ్ కార్మికులకు 36 నెంబర్ జీవో ప్రకారం జీతాలు, దహన సంస్కారాల ఖర్చులు రూ.20 వేలకు పెంచడం వంటి డిమాండ్లు నెరవేర్చాలన్నారు. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక ఆందోళన చేపట్టడానికి మున్సిపల్ కార్మికులు సన్నద్ధంగా ఉన్నరన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.సోమయ్య, లావేటి కృష్ణారావు, అంగుళూరు జానుబాబు, బంగారు వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.