గంధమల్లకు లైన్ క్లియర్
ఆమోదం తెలిపిన రాష్ట్ర క్యాబినెట్
ఫ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం
1.41 టీఎంసీలకు కుదింపు
ఫ 1,144 ఎకరాలకు తగ్గనున్న భూ సేకరణ
ఫ గంధమల్ల, వీరారెడ్డిపల్లి, ఆవాస
గ్రామాలకు తప్పనున్న ముంపు ముప్పు
ఫ యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి ఏర్పాటుకూ ఆమోదం
సాక్షి, యాదాద్రి : జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామ సమీపంలో ప్రతిపాదించిన గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జలాశయం నిల్వ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు కుదిస్తూ ఇదివరకే నిర్ణయం తీసుకోగా అధికారికంగా ఆమోదించింది. సుమారు 65 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ఆరేళ్ల తరువాత పట్టాలెక్కనుండడంతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు, రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దీంతో పాటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
గంధమల్ల రిజర్వాయర్ స్వరూపం ఇదీ..
కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలో భాగంగా ప్యాకేజీ–15లో తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని గత ప్రభుత్వం 2017లో ప్రతిపాదించింది. కానీ, వివిధ కారణాల వల్ల రిజర్వాయర్ ఆరేళ్లుగా హోల్డ్‌లో ఉంది. 9.36 టీఎంసీల నిలువ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని తొలుత నిర్ణయించారు. ఇందుకోసం 4,027 ఎకరాలు అవసరమని, భూములను రైతుల నుంచి, అటవీభూములు సేకరించాలని, నష్టపరిహారం కింద రూ.379 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని నిర్ణయించారు. అయితే గంధమల్ల, వీరారెడ్డి గ్రామాల పరిధిలో పెద్ద ఎత్తున ఆవాసాలు ముంపునకు గురవుతుండడంతో ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో 2018లో రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 టీఎంసీలకు కుదించడంతో వీరారెడ్డిపల్లితో పాటు మరికొన్ని ఆవాస గ్రామాలు బయటపడ్డాయి. ఆతరువాత భూ సేకరణ 2,423 ఎకరాలకు తగ్గింది. అయినా ముంపు గ్రామాల ప్రజలు ఆందోళలు ఆపకపోవడంతో రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు కుదించాలని అధికారికంగా నిర్ణయించారు. దీనివల్ల గంధమల్లతో పాటు పలు ఆవాస గ్రామాలు ముంపునుంచి బయటపడనున్నాయి. అంతేకాకుండా భూ సేకరణ 1,144 ఎకరాలకు తగ్గనుంది. ప్రారంభంలో రిజర్వాయర్ నిర్మాణాన్ని రూ.860 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించగా.. నీటి నిలువ సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా రూ.575 కోట్లకు తగ్గింది. రిజర్వాయర్ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదమద్ర వేసినందున.. పనులు ప్రారంభించడమే మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment