
పాలకుల చేతగానితనంతోనే ఈ దుస్థితి
పెన్‌పహాడ్: రాష్ట్రంలో పాలకుల చేతగానితనంతోనే పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. పొలాలు ఎండిపోయి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ఆయన మంగళవారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని దుబ్బతండా, రత్యాతండాల్లో ఎండిపోయిన వరి చేలను పరిశీలించారు. ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ.35వేలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ఒక బటన్ నొక్కితే సూర్యాపేట జిల్లాకు నీళ్లు వస్తాయని తెలిపారు. ప్రభుత్వం మూర్ఖంగా ఆలోచిస్తుందన్నారు. ప్రభుత్వ కక్షపూరిత వైఖరి కారణంగానే సూర్యాపేటలో పంటలు ఎండిపోతున్నాయన్నారు. సూర్యాపేట జిల్లాలోనే 60వేల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రికి నీళ్లు ఇవ్వాలన్న సోయి ఉండాలన్నారు. నీళ్లు ఇస్తామని చెప్తేనే రైతులు సాగు చేశారని ఆయన పేర్కొన్నారు. రైతు సమస్యలపై ప్రశ్నిస్తే, వాస్తవాలు మాట్లాడితే తనని అకారణంగా బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. ఎవరు ప్రశ్నించినా.. వారిపైన కేసులు పెట్టడం, నిర్బంధించడం, భయపెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. రేవంత్‌రెడ్డి ఒక్కసారి రైతుల వద్దకు వచ్చి చూస్తే.. రైతులు మీ బట్టలుడదీసి కొడతారన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి తమ కళ్ల ముందే పంటల ఎండిపోతుంటే రైతులు తల్లడిల్లుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తమకు అప్పగిస్తే మూడే మూడు రోజుల్లో రైతుల పొలాలకు నీళ్లు ఇచ్చి చూపిస్తామని, అలా చేసే దమ్ముందా సీఎం రేవంత్‌రెడ్డి అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. జగదీష్‌రెడ్డి వెంట బీఆర్‌ఎస్ నాయకులు నెమ్మాది భిక్షం, దొంగరి యుగేంధర్, వెన్న సీతారాంరెడ్డి, తూముల ఇంద్రసేనారావు, మిర్యాల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
పంటలు ఎండిపోతుండడంతో రైతులు విలపిస్తున్నారు
మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment