
ఎన్నో ఆశలతో అతను ఆమెను మనువాడాడు.. కానీ.. ఆమె మాత్రం అంతకుముందే మరొకరితో ప్రేమాయణంలో ఉంది.. ఈ మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చాలను కుంది. ప్రియుడితో కలిసి పథకం వేసింది. ఇద్దరూ కలిసి అమలు చేశారు. ఆమె భర్తపై ప్రియుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏమీ తెలియనట్లు ఆమె నటించింది. పోలీసుల దర్యాప్తులో ఈ దారుణం వెలుగు చూసింది. నిందితులిద్దరూ కటకటాల పాలయ్యారు.
వైఎస్సార్ : ఓ యువతి ప్రియుడితో కలిసి ఏకంగా భర్తపైనే హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సిద్దవటం మండలంలోని కనుమలోపల్లె సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంగళళవారం సాయంత్రం సిద్దవటం పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ వెల్లడించారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తికి చెందిన అవ్వరు జ్ఞానేశ్వర్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. మూడు నెలల కిందట కడప హనుమప్ప వీధికి చెందిన నవితతో వివాహం జరిగింది. గత నెల 19వ తేదీన శ్రీకాళహస్తి నుంచి తన భార్యను పిలుచుకొని కడపలోని అత్తగారి ఇంటి వద్దకు తీసుకొని వచ్చాడు. తిరిగి జ్ఞానేశ్వర్ శ్రీకాళహస్తికి వెళ్లాడు. అదే నెల 25వ తేదీన అత్తగారి ఇంటిలో ఉన్న తన భార్యను పిలుచుకొని వెళ్లేందుకు కడపకు వచ్చాడు.
ఆరోజు రాత్రి అత్తగారి ఇంట్లోనే బసచేసి మరుసటిరోజు 26వ తేదీన ఉదయం తన భార్యను వెంటబెట్టుకొని కడప నుంచి కారులో శ్రీకాళహస్తికి బయలు దేరాడు. సిద్దవటం మండలంలోని కనుమలోపల్లె గ్రామ సమీపంలోకి రాగానే తనకు వాంతికి వస్తుందని కారు ఆపాలని భర్తతో చెప్పడంతో ఆయన కారును ఆపాడు. ఇంతలోనే అకస్మాత్తుగా కడపలోని హనుమప్ప వీధికి చెందిన జాహ్వారి కాపిష దుర్గేష్‌సింగ్ అక్కడికి వచ్చి జ్ఞానేశ్వర్‌పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. భార్య నవిత తనకేమీ తెలియనట్లు భర్తను వైద్యం కోసం కడపలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. ఈ ఘటనపై జ్ఞానేశ్వర్ గత నెల 27వ తేదీన సిద్దవటం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 10 రోజుల్లోనే హత్యాయత్నం కేసును చేఽధించారు. నవితకు వివాహం జరగక ముందే పక్కింటికి చెందిన ఎంబీఏ చదువుతున్న జాహ్వారి కాపిష దుర్గేష్ సింగ్‌తో ప్రేమలో ఉంది. నవితకు వివాహం అయినప్పటికీ భర్త జ్ఞానేశ్వర్‌తో అయిష్టంగానే కాపురం కొనసాగించింది. ఏప్రిల్ 26వ తేదీన భర్తను హతమార్చాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది. కనుమలోపల్లె గ్రామ సమీపంలో వాంతికి వస్తుందని భర్తను నమ్మించి కారును ఆపింది. భర్తపై ప్రియుడి చేత కత్తితో హత్యాయత్నం చేయించింది. ఈ విషయాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.
ఈ ఘటనకు సంబంధించి మంగళవారం ఉదయం 11 గంటలకు కడప నగరం ఔటర్‌రింగ్ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వద్ద నవిత ప్రియుడితో ఉండటంతో సమాచారం రావడంతో వారిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. హత్యాయత్నానికి వినియోగించిన మారణాయుధం, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని సిద్దవటం కోర్టులో హాజరు పరిచారు. అనతి కాలంలోనే కేసును చేధించిన సిద్దవటం ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్ ను, ఆయన సిబ్బందిని జిల్లా ఎస్పీ అన్భూరాజన్ అభినందించారు. ఒంటిమిట్ట సీఐ పురుషోత్తంరాజు, ఎస్‌ఐ తులసీనాగప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment