వైవీయూ వెబ్‌సైట్ సేవలకు అంతరాయం
వైవీయూ : ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆన్‌లైన్ సేవల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే విశ్వవిద్యాలయ అధికారుల నిర్లక్ష్యంతో విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ సేవలు నిలిచిపోయాయి. యోగివేమన విశ్వవిద్యాలయానికి డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.వైవీయూ.ఈడీయూ.ఇన్ అనే వెబ్‌సైట్‌ను అధికారికంగా నిర్వహిస్తూ వస్తోంది. సాంకేతిక సేవలు, ఇతరత్రా సేవలు అందించేందుకు నెల్లూరుకు చెందిన కేవీఆర్‌ఎస్‌ఎస్ సంస్థ గత కొద్ది సంవత్సరాలుగా ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తోంది. అయితే సదరు సంస్థ సేవలు గతనెల 19వ తేదీనే ముగిశాయి.
అయితే సదరు సంస్థ నిర్వాహకులు వైవీయూ ఐటీ విభాగానికి సమాచారం అందించినప్పటికీ పట్టించుకోలేదన్న విధంగా వెబ్‌సైట్ సర్వీసెస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. వైవీయూ అధికారుల నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో ఈనెల 16వ తేదీన విశ్వవిద్యాలయానికి అందించే సాంకేతిక సేవల నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. తాజాగా శుక్రవారం పలువురు విద్యార్థులు, ఇతర ప్రాంతాల పరిశోధకులు వైవీయూ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే ‘సర్వీసెస్ సస్పెండ్’ అని వస్తుండటంతో వైవీయూ అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు.
త్వరగా అందుబాటులోకి తీసుకువస్తాం..
వైవీయూ వెబ్‌సైట్ నిలిచిపోయిన విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. సదరు సంస్థ వర్క్ ఆర్డర్ గడువు ముగియడంతో సేవలకు అంతరాయం కలిగింది. వైవీయూ వెబ్‌సైట్‌ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువస్తాం.
– ఆచార్య టి. శివప్రతాప్, ఐటీసెల్ డైరెక్టర్, వైవీయూ
సేవలను నిలిపివేసిన నిర్వాహక సంస్థ
Comments
Please login to add a commentAdd a comment