
మూల్యాంకనానికి వేళాయె
● పదో తరగతి పేపర్లు దిద్దేందుకు ఏర్పాట్లు పూర్తి
● 3 నుంచి 9 వరకు నిర్వహణ
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మంగళవారం ముగిశాయి. విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను దిద్దేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. కడప మున్సిపల్ హైస్కూల్ (మెయిన్)లో ప్రభుత్వ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 1,80,965 పేపర్లు రానున్నాయి. జిల్లాలో 1515 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిలో జవాబు పత్రాలకు మూల్యాంకనం నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జామినర్లతోపాటు పరిశీలించేందుకు చీఫ్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ క్యాంపు ఆఫీసర్, డిప్యూటీ డీఈఓ రాజగోపాల్‌రెడ్డి డిప్యూటీ క్యాంపు ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. మరో ఏడుగురు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు.
ఆరుగురు ఏఈలకు ఒక సీఈ,
ఇద్దరు స్పెషల్ అసిస్టెంట్లు: విద్యార్థుల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసేందుకు ఆరుగురు చొప్పున అసిస్టెంట్ ఎగ్జామినర్లు(ఏఈ), ఒక చీఫ్ ఎగ్జామినర్‌తోపాటు ఇద్దరు స్పెషల్ అసిస్టెంట్లను ఒక బృందంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందంలోని ఒక్కొక్క ఏఈ రోజుకు 40 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఏఈలు మూల్యాంకనం చేసిన పత్రాలను సీఈలు క్షుణంగా పరిశీలిస్తారు. విద్యార్థులు రాసిన సమాధానాలు సరైనవి, కానివి పరిశీలించి వేసిన మార్కులను నిశిత పరిశీలన చేస్తారు. అదే విధంగా సమాధాన పత్రాలు, ఏఈలు వేసిన మార్కులను కూడి మొత్తం మార్కులను వేసే విధులను స్పెషల్ అసిస్టెంట్లు నిర్వహిస్తారు.
నిబంధనలు అమలు
పదో తరగతి మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. మూల్యాంకనం జరుగుతున్న వైపు ఇతరులు రాకుండా ఆంక్షలు విధిస్తున్నారు. విధుల్లో పాల్గొనే సిబ్బంది సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వెంట తీసుకెళ్లడానికి వీలు లేకుండా నిబంధనలు జారీ చేయనున్నారు.
1515 మంది సిబ్బంది ఏర్పాటు
రాష్ట్ర వ్యాప్తంగా మూల్యాంకనానికి రానున్న దాదాపు 1,80,965 పేపర్లను మూల్యాంకనం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 1515 మంది సిబ్బందిని విధులకు ఏర్పాటు చేశారు. ఇందులో చీఫ్ ఎగ్జామినేటర్లతోపాటు అసిస్టెంట్ ఎగ్జామినర్లను కలిపి 1104 మందిని, స్పెషల్ అసిసెంట్లుగా 411 మందిని నియమించారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం నిర్వహించనున్నారు. విధులకు హాజరయ్యే సిబ్బందికి అన్ని రకాల మౌలిక వసతులను ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాటు చేసింది.