
ప్రజాస్వామ్యం అపహాస్యం
ప్రొద్దుటూరు: స్వయంగా పోలీసుల సమక్షంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి మండిపడ్డారు. ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత వారంలో గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక సందర్భంగా పోలీసులు, టీడీపీ నేతలు అనుసరించిన వైఖరిని తూర్పారబట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని బట్టలు ఊడదీసి నడిబజారులో నిలబెట్టారని విమర్శించారు. వాస్తవానికి టీడీపీకి ఒకే వార్డు మెంబర్ ఉన్నారని, పార్టీ మారిన వారితో కలిపి ఆరుగురు అయ్యారన్నారు. వైఎస్సార్‌సీపీకి సంబంధించి 14 మంది వార్డు మెంబర్లు ఉంటే టీడీపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా బెదిరించి వైఎస్సార్‌సీపీ వార్డు మెంబర్లను ఓటింగ్‌కు రాకుండా రాళ్లతో దాడి చేశారన్నారు. వాస్తవానికి వార్డు మెంబర్లు మాత్రమే పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లాల్సి ఉండగా 30 మంది టీడీపీ నాయకులు చేపల మార్కెట్‌కు వెళ్లినట్లు వస్తున్నా పక్కన ఉన్న పోలీసులు ప్రశ్నించకుండా మిన్నకుండిపోయారని తీవ్ర విమర్శలు చేశారు. తమ వార్డు సభ్యులు ఓటింగ్‌కు వెళుతుండగా రాళ్లతో దాడి చేయడంతో ప్రాణభయంతో బయటపడ్డారన్నారు. ఇన్ని జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారన్నారు. నిస్సిగ్గుగా టీడీపీ నేతలు వ్యవహరించిన కారణంగానే చివరికి ఎన్నిక వాయిదా పడిందన్నారు. ఫేక్ ఐడీ కార్డులతో దొంగ వార్డు సభ్యులను లోనికి పంపి ఎన్నిక జరిపించాలని టీడీపీ నేతలు ఎన్నికల అధికారిని బూతులు తిట్టి చేయిచేసుకున్నారని ఆరోపించారు. బచ్చల పుల్లయ్య, బచ్చల ప్రతాప్, సెల్‌పాయింట్ నవీన్, చీమల రాజశేఖరరెడ్డి, పర్లపాడు మహేశ్వరరెడ్డి లాంటి వారంతా లోనికి ఎలా వెళ్లగలిగారని ప్రశ్నించారు. స్వయంగా తమ ఉప సర్పంచ్ అభ్యర్థిని కొట్టుకుంటూ ఈడ్చుకెళుతున్నా పోలీసులు నిలువరించలేకపోయారని తెలిపారు. డీఎస్పీతోపాటు పట్టణంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలతోపాటు అక్కడే ఉండగా ఈ దౌర్జన్యకాండ జరిగిందన్నారు. టీడీపీ నేతలు విచ్చల విడిగా అరాచకానికి, దౌర్జన్యానికి పాల్పడినా కనీసం ప్రశ్నించలేకపోయారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ నాయకులు అడ్డు అదుపు లేకుండా పెట్రేగిపోతున్నారని విమర్శించారు.
● సమావేశంలో ఎంపీపీ శేఖర్ యాదవ్, సర్పంచ్ మోషా, ఉపసర్పంచ్ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తప్పు చేసిన వారిని సస్పెండ్ చేయాలి
నేడు ఎస్పీని కలుస్తాం
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి