
బ్రహ్మోత్సవం.. నయనమనోహరం
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మోహినీ అలంకారంలో స్వామివారు జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చాడు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వ హించారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ జరిగింది. అనంతరం రాత్రి 7 గంటల నుంచి గరుడ సేవ ఘనంగా జరిగింది. రామయ్య పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. కళాకరుల కోలాటాలు, చెక్కభజనల మధ్య కోదండ రాముడి ఊరేగింపు కనులపండువగా సాగింది. ఈ కార్యక్రమం టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. గురువారం సీతారాముల కళ్యాణం జరుగుతున్న నేపథ్యంలో దాశరథి దివ్యక్షేత్రాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు: బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజు శుక్రవారం ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు శివధనుర్భంగాలంకారం, 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం. సాయంత్రం 3:15 నుంచి 5 గంటల వరకు ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 6:30 నుంచి 8:30 వరకు కల్యాణోత్సవం, 9:30 నుంచి 10:30 వరకు గజవాహనం, 11 నుంచి 11:15 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.
మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు
వైభవంగా గరుడవాహసేవ

బ్రహ్మోత్సవం.. నయనమనోహరం