స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి భారీగా సానుకూల సంకేతాలు రావడంతో మన మార్కెట్లు కూడా పరుగు పెడుతున్నాయి. సెన్సెక్స్ 290 పాయింట్ల దాకా లాభపడుతూ 20 వేల 20 పాయింట్లకు సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ 80 పాయింట్లకు పైగా పెరుగుతూ 5,930 పాయింట్లకు సమీపంలో కొనసాగుతోంది. ఐటీ, హెల్త్‌కేర్ తప్పించి అన్ని సెక్టోరల్ సూచీలు లాభాల్లో ఉన్నాయి. బ్యాంకెక్స్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 2 శాతం దాకా లాభపడుతున్నాయి. నిఫ్టీలో మారుతి, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, పవర్‌గ్రిడ్ షేర్లు 3 శాతానికి పైగా లాభపడుతూ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. గ్రూపు ఏలో యెస్ బ్యాంకు, జీఎండీసీ, జీఎంఆర్ ఇన్‌ఫ్రా, ఎన్హెచ్పీసీ, ఫెడరల్ బ్యాంకు షేర్లు 4 నుంచి 6 శాతం లాభపడుతూ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు రూపాయి 78 పైసలు లాభపడుతూ 62 రూపాయల 72 పైసల వద్ద ట్రేడవుతోంది. ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఈవాళ మంచి లాభాల్లో ఉన్నాయి. గత వారాంతంలో అమెరికా మార్కెట్లు ఓ మాదిరిగా లాభపడ్డాయి. యూరోప్ మార్కెట్లలో బ్రిటన్ స్వల్పంగా పడింది. జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు స్వల్పంగా పెరిగాయి. అదే బాట. ఈ ఉదయం ఆసియా మార్కెట్లు బాగా లాభపడుతున్నాయి. సింగపూర్ నిఫ్టీ 120 పాయింట్ల దాకా లాభపడుతూ 5,600లకు సమీపంలో ట్రేడవుతోంది.