హస్తినలో తెలంగాణ సెగ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంత నేతలు ఈరోజు ఉదయం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో భేటీ అయ్యారు. విభజనకే అధిష్టానం మొగ్గుచూపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా... మంత్రి పదవులకు రాజీనామా చేయాలనే ఆలోచనలో సీమాంధ్ర నాయకులున్నారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సీమాంధ్ర నేతలు శనివారం ఉదయం సమావేశం అయ్యారు. భేటీ అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజించే పరిస్థితే వస్తే తాము పదవుల్లో కొనసాగలేమనే విషయాన్ని ఇప్పటికే సోనియా గాంధీకి వెల్లడించామన్నారు. 15 మంది మంత్రుల సంతకాలతో లేఖను సోనియా గాంధీకి నిన్ననే అందజేసినట్టు ఆయన వెల్లడించారు. అయితే పార్టీలోనే ఉండి రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు కృషి చేస్తామన్నారు.