ఎత్తు పెంచాలంటూ తమ దగ్గరికి వచ్చిన నిఖిల్‌రెడ్డి అనే యువకుడికి.. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, వైద్య ప్రమాణాలకు విరుద్ధంగా శస్త్రచికిత్స చేసిన గ్లోబల్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జన్ చంద్రభూషణ్‌పై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన రెండేళ్లపాటు ఎటువంటి వైద్యం చేయకుండా నిషేధం విధించింది. ఆయనతోపాటు వైద్యవృత్తికి కళంకం తెచ్చే విధంగా వ్యవహరించిన మరికొందరు వైద్యులపైనా మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. సరోగసీ విధానంలో అక్రమానికి పాల్పడిన సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రతపై ఐదేళ్ల పాటు సస్పెన్షన్ విధించింది.తప్పుడు విధానాలు అవలంబించిన సికింద్రాబాద్‌కు చెందిన డాక్టర్ రాహుల్ కార్టర్, మలక్‌పేట్‌కు చెందిన డాక్టర్ హరికుమార్ రవ్వా, డాక్టర్ మినాజ్ జఫర్‌లపైనా చర్యలు తీసుకుంది. శుక్రవారం మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీంద్రారెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ కఠిన చర్యలు తీసుకుంది. ఈ సమావేశానికి వైద్య విద్య డెరైక్టర్ రమణి, కాళోజీ వర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.