హైదరాబాద్ : రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉండవల్లి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గురువారం హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉండవల్లి మాటల్లో వెటకారం తప్ప హేతుబద్ధతు లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే దేశ సమగ్రతకు ముప్పు ఏర్పడుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఎన్డీయే మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయడం వల్ల దేశసమగ్రతకి వచ్చిన ముప్పేంటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ఏకాభిప్రాయంతోనే జరగాలని వాదిస్తున్న సీమాంధ్ర నేతలు మరి పోలవరం పై ఏకాభిప్రాయం వచ్చేంత వరకు ఎందుకు ఆగడం లేదని విమర్శించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది కేసీఆర్ కాదని.... ఉండవల్లేనని హరీష్ రావు ఎదురు దాడికి దిగారు. తెలంగాణ వస్తుందంటే సీమాంధ్ర నేతలు ఏదో కుట్ర చేస్తారని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చినా.... ఇవ్వకున్నా... దేశంలో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ ఆగదని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఉండవల్లి డయ్యర్లా మాట్లాడుతున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు.