పొరపాటున పట్టు తప్పితే.. అతని ప్రాణాలు నీళ్లలో కలిసిపోయేవి! కానీ ఆ సమయానికి అతను అక్కడ లేకపోతే.. నగరం ఒక పెను విషాదాన్ని చవిచూడాల్సి వచ్చేది!! అవును. ఇంకా పేరు వెల్లడికాని ఆ కానిస్టేబుల్‌ను నెటిజన్లు రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు... ఇంతకీ ఆయన చేసిన పనేంటి? ఎలా వెలుగులోకి వచ్చింది? రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షానికి హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరింది. పండుగ సీజన్ కావడంతో హోరువర్షంలోనూ నెమ్మదిగానైనా జనం రాకపోకలు సాగిస్తున్నారు. మాదాపూర్‌లోనైతే శుక్రవారం వరద నదిని తలపించే స్థాయిలో పారింది. అదే సమయంలో కాళి సుధీర్ అనే వ్యక్తి తన కారులో అటుగా వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని వీడియోతీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్ వైరల్ అయింది.