అక్రమాస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పుతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. అమ్మ చివరి మాటలను నిజం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. 'దివంగత ముఖ్యమంత్రి 'అమ్మ' జయలలిత ఆత్మ ఇంకా సజీవంగానే ఉంది. అమ్మ ఆశయ సాధన కోసం పోరాడతాను. అమ్మ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తాం. పార్టీ ఎమ్మెల్యేలు, శ్రేణులు కాస్త సంయమనం పాటించాలి. అన్నాడీఎంకేను చీల్చేందుకు కుట్ర జరుగుతోంది' అని పేర్కొన్నారు. తనకు మద్ధతు తెలిపిన అన్నాడీఎంకే నేతలు, ప్రజలు అందరికీ ఈ సందర్భంగా పన్నీర్ కృతజ్ఞతలు తెలిపారు.