కులపిచ్చి, బంధుప్రీతిల వల్లే అనంతపురం నాశనమవుతోందని ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. నగర పాలక సంస్థలో ఒక సామాజిక వర్గం కొనసాగిస్తున్న పరిపాలన వల్లే పరిస్థితి ఇంత ఘోరంగా తయారైందని ఆగ్రహించారు. ఆదివారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతలో పందుల కారణంగా చిన్నారులు చనిపోతున్నారన్నారు. తాను ఏ మంచి కార్యక్రమం చేపడదామన్నా అడ్డు తగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే రెండో అత్యుత్తమ మున్సిపాలిటీగా తాడిపత్రిని తీర్చిదిద్దామన్నారు. ఎవరెన్ని జన్మలెత్తినా తాడిపత్రి మాదిరి ఇక్కడ చేయలేరన్నారు. డివైడర్లు అంటూ అనవసర ఖర్చు పెట్టి ఉన్న నిధులు స్వాహా చేశారని ఆరోపించారు. సీఎంకు వాస్తవాలు తెలియవా..? అని ప్రశ్నించారు. ఇక్కడి వ్యవహారంపై 21న చంద్రబాబును కలసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.