పెద్దనోట్ల రద్దు దేశవ్యాప్తంగా ఉన్న యాక్సిస్ బ్యాంకు శాఖల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. యాక్సిస్ బ్యాంకు బాగోతం మరువకముందే మరో ప్రముఖ ప్రైవేటు బ్యాంకులో నకిలీ ఖాతాల వ్యవహారం కలకలం రేపుతోంది. న్యూఢిల్లీ కస్తుర్బా గాంధీ మార్గ్‌లో ఉన్న కోటక్ మహేంద్ర బ్యాంకు శాఖపై తాజాగా ఆదాయపన్ను (ఐటీ) అధికారులు నజర్ పెట్టారు. ఈ బ్యాంకులో దాదాపు రూ. 70 కోట్లు డిపాజిట్ చేసిన నకిలీ ఖాతాలు వెలుగుచూసినట్టు సమాచారం. ఇందులో రూ. 39 కోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అధికారుల సహకారంతో తొమ్మిది నకిలీ ఖాతాలు తెరిచి.. అందులో సుమారు రూ. 39 కోట్లను డిపాజిట్ చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నకిలీ ఖాతాలన్నింటినీ రమేశ్ చంద్, రాజ్‌కుమార్ అనే వ్యక్తుల నియంత్రణలో ఉన్నట్టు భావిస్తున్నారు.