రెండు దశాబ్దాలపాటు గ్యాంగ్‌స్టర్ నయీమ్ సాగించిన వికృత క్రీడను చూసీచూడనట్టు వదిలేసిన ఖాకీ టోపీలు కొన్నయితే.. అన్నీ తెలిసినా నోరుమెదపని ఖద్దరు టోపీలు మరికొన్ని..! విద్యార్థి దశలో ఉన్నప్పుడే రౌడీగా చలామణి కావాలన్న నయీమ్ ఆరాటానికి అటు పోలీసు పవర్.. ఇటు రాజకీయ అండ తోడవడంతో మరింత రెచ్చిపోయాడు. రెండు వర్గాలకు అతి సన్నిహితంగా మెలుగుతూ బెదిరింపులు, కబ్జాలు, సెటిల్‌మెంట్లు, హత్యలతో వేల కోట్ల నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. చివరికి ప్రభుత్వానికే సవాల్‌గా మారాడు. ఆ నేర సామ్రాజ్యం, అతి దారుణంగా సాగించిన వికృత క్రీడలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మరి ఇన్నాళ్లూ అతడికి అండదండలు అందించిన ‘అదృశ్య శక్తులు’ ఏ సమయంలో ఎలా వ్యవహరించాయి? తమ ఆయుధాన్ని అవసరానికి ఎలా వాడుకున్నాయి? ఆ గ్యాంగ్‌స్టర్ రక్త చరిత్రలో కీలక మలుపులేంటి..?