ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు దోషిగా నిర్ధారించిన అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయారు. బుధవారం సాయంత్రం బెంగళూరులో పరప్పణ అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన కోర్టు హాల్‌లో ఆమె న్యాయమూర్తి అశ్వర్థనారాయణ ఎదుట హాజరయ్యారు. శశికళతో పాటు ఈ కేసులో దోషులుగా తేలిన సుధాకరన్, ఇళవరసి కూడా కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వీరిని జైలుకు తరలించారు. ఆమెకు జైలులో ప్రత్యేక గది ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జైలు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు.