వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హతా పరీక్ష నీట్ నోటిఫికేషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉన్నత ధర్మాసనం తీర్పుతో రాష్ట్ర విద్యార్థులకు ఊరట లభించింది. జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి వైద్య విద్య ప్రవేశాలు నిర్వహించాలన్న కేంద్రం ఆలోచనకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. 'నేషనల్ ఎలిజిలిటి ఎంట్రెన్స్ టెస్ట్' నీట్ చెల్లదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించే అధికారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. నీట్ కోసం ఎంసీఐ జారీ చేసిన నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని ప్రకటించింది. రాష్ట్రానికి సంబంధించి ఎంసెట్ ద్వారానే ప్రవేశాలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమమైంది. ముగ్గురు సభ్యుల బెంచ్‌లో ఒకరు ఈ తీర్పును వ్యతిరేకించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమస్ కబీర్, జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్ నీట్‌ను కొట్టేయాలని చెప్పగా... బెంచ్‌లోని మరో సభ్యుడు జస్టిస్ అనిల్ దవే ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహణ చట్టబద్ధమని తీర్పు ఇచ్చారు. ‘నీట్’ నిర్వహణపై పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వీటిని పరిశీలించిన సుప్రీం కోర్టు నీట్‌తో పాటు వివిధ రాష్ట్రాలు విడిగా ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోవచ్చని, ఫలితాలను మాత్రం వెల్లడించరాదని గతంలో మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించి మెడిసిన్, డెంటల్ ప్రవేశాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. దాంతో నీట్ ను రద్దు చేయాలంటూ పలు రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దాదాపు రెండేళ్లుగా నీట్ పరీక్ష వ్యవహారం కోర్టుల్లో నలుగుతోన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వచ్చే సంవత్సరం నుంచి మెడిసిన్ ఎంట్రెన్స్ కోసం ఎంసెట్ ఉంటుందా లేదా? అన్న అనుమానాలకు తెరపడింది.
Published Thu, Jul 18 2013 2:43 PM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement