విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తుండటంతో తెలంగాణ అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. అంతకుముందు ఒకసారి పది నిమిషాలు, మరోసారి అరగంట చొప్పున వాయిదా పడిన సభ.. చివరకు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సమావేశమైనప్పుడు కూడా విపక్ష సభ్యులు ఏమాత్రం తగ్గకుండా నినాదాలు కొనసాగించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం టీఆర్ఎస్కు తగదంటూ కాంగ్రెస్ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్నోత్తరాల సమయం నుంచే ఈ గందరగోళం మొదలైంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ.. ఫిరాయింపుల అంశాన్ని గట్టిగా లేవనెత్తింది. దీనిపై చర్చించాలని పట్టుబట్టింది. నల్ల బ్యాడ్జీలు ధరించిన కాంగ్రెస్ సభ్యులు ఉదయం 10 గంటల నుంచే ఆందోళన మొదలుపెట్టారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, దీనిపై వాయిదా తీర్మానాన్ని ఆమోదించాలని పట్టుబట్టారు. అసెంబ్లీలో దీనిపై చర్చించాలని, పార్టీలు మారిన సభ్యులను స్పీకర్ అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేటీఆర్ మండిపడ్డారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లిందన్నట్లు కాంగ్రెస్ తీరు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఎంతకూ కాంగ్రెస్ సభ్యుల నినాదాలు ఆగకపోవడంతో స్పీకర్ మధుసూదనాచారి సభను మంగళవారానికి వాయిదా వేశారు.