సామరస్యంగా సమస్యల పరిష్కారం:కెసిఆర్ | telangana chief minister kct press meet | Sakshi
Sakshi News home page

Aug 17 2014 4:57 PM | Updated on Mar 20 2024 1:58 PM

ఏపి ముఖ్యమంత్రికి, తనకు మధ్య గవర్నర్ నరసింహన్ సమక్షంలో సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరిగినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. భేదభావాలు లేకుండా ముందుకు సాగుతామని చెప్పారు. సామరస్యంగా సమస్యలు పరిష్కారించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాలు బాగుండాలన్నదే తమ ప్రధాన ఉద్దేశం అన్నారు. తెలంగాణకు సముద్రంలేదు. పోర్టు కావాలి. అందుకు వారి సహకారం కావాలి. అలాగే ఏపి వారికి హైదరాబాద్తో అవసరాలు ఉంటాయి. ఆ విషయంలో మన సహకారం ఉంటుంది. ఇక ముందు కూడా ఏమైనా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకుందామని అనుకున్నట్లు తెలిపారు. సమగ్ర సర్వేతో ప్రజలకెంతో ఉపయోగం అన్నారు. ఆంధ్రావాళ్లను గుర్తించి, వారిని వెళ్లగొట్టడానికే సర్వే అన్నది వాస్తవం కాదని చెప్పారు. అటువంటి ఉద్దేశం తమకు లేదని తెలిపారు. సర్వే విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేవని తెలిపారు. బ్యాంక్ అకౌంట్, ఇతర విషయాలు వివరాలు ఇస్తే ఇవ్వొచ్చు, లేకుంటే లేదన్నారు. పెన్షన్ వంటి సంక్షేమ పథకాల డబ్బు నేరుగా వారి ఖాతాలో వేసేందుకే అకౌంట్ వివరాలు అడుగుతున్నట్లు తెలిపారు. నిజమైన లబ్దిదారులను సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. కుటుంబాల సంఖ్య కంటే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు అధికంగా ఉన్నట్లు తెలిపారు. కుటుంబ సమగ్ర సర్వే అధ్యయనానికి ప్రజలు సహకరించాలని కోరారు. నిజమైన అర్హులకే సంక్షేమ పథకాలు అందాలన్నారు. 19న సర్వే రోజు ఆర్టీసీ బస్సులు తిరగవని చెప్పారు. ఎమర్జెన్సీ మినహా అంబులెన్స్‌లకు అనుమతి ఇస్తామన్నారు. దళితవాడల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మార్కెట్‌ కమిటీలలో ఎస్సీ, ఎస్టీలకు 22శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పారు. బీసీలకు కూడా పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం రిజర్వేషన్కు అవకాశం కల్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. తెలంగాణ యూనివర్శిటీల్లో కూడా ఎస్సి,ఎస్టిలకు 22 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామన్నారు. దళిత విద్యార్ధినిలకు నియోజకవర్గానికి ఒక హాస్టల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్ధానికత అంశంపై 1956 ప్రాతిపదికగా జీవో ఇచ్చిన విషయం గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ జరగలేదన్నారు. ఫాస్ట్ పథకాన్ని మాత్రమే తాము అమలు చేస్తామని చెప్పారు. రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ పాపమేనన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యం వల్లే విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని చెప్పారు. అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఫీజు రీయింబర్స్ కోసమే కొన్ని కాలేజీ లు పుట్టుకొచ్చాయని చెప్పారు. అలాంటి కాలేజీ లు అవసరమా? అని ప్రశ్నించారు. ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత లోపించిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఫల్యాలను సరిచేస్తాం, ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత పెంచుతామని కెసిఆర్ చెప్పారు. కేంద్రం తమతో మంచిగా ఉంటే, మంచిగా ఉంటామని చెప్పారు. వరల్డ్ హెరిటేజ్‌లోకి గోల్కొండ కోట చేరుస్తామన్నారు. తప్పులు, అన్యాయాలు చేస్తే సహించనని హెచ్చరించారు. అనుకున్నది చేస్తానని చెప్పారు. దొంగల పాలిట కేసీఆర్ హిట్లరేనన్నారు. సుహృద్భావ వాతావరణం కోసం చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రాల మధ్య సమస్యలపై చర్చించినట్లు చెప్పారు. అసెంబ్లీ కేటాయింపు, ఉద్యోగుల కేటాయింపుపై మాట్లాడుకున్నామన్నారు. స్నేహపూర్వకంగానే మాట్లాడుకున్నట్లు తెలిపారు. పరస్పర ఒప్పందం కుదిరితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఉద్యోగుల విభజనలో కమిటీ ఎందుకని చర్చించామని చెప్పారు. టెన్త్ షెడ్యూల్‌లో ఉన్న సంస్థలు ఎవరికీ చెందుతాయన్న అంశం చర్చకు వచ్చిందని తెలిపారు. ఏమైనా సమస్యలుంటే భవిష్యత్‌లో కూడా చర్చించుకుంటామన్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 10 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. చిన్నచిన్న విషయాలపై పోట్లాడుకోవడం సరికాదన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement