ఒంటరి పోరాటానికే టీఆర్ఎస్ మొగ్గు చూపింది. ఏపార్టీతోనూ పొత్తులు లేదా విలీనాలు లేకుండా.. తమంటత తాముగానే పోటీ చేయాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనలిచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు నగేష్, సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద ఆయన మాట్లాడారు. అంతకుముందు పార్టీ పొలిట్బ్యూరో, పార్లమెంటరీ బోర్డు సమావేశమయ్యాయి. ఇక కేసీఆర్ మాట్లాడుతూ.. ''తెలంగాణ ఉద్యమంలో అనేక త్యాగాల తర్వాత రాష్ట్రం వచ్చింది. తెలంగాణకు ఒక సమర్ధ, పటిష్ఠ నాయకత్వం రావాల్సిన అసవరం ఉంది. దేశానికి కాశ్మీర్ ఎలాంటిదో తెలంగాణకు ఆదిలాబాద్ జిల్లా అలాంటిది. అయినా అక్కడ కూడ ఆకరువుతో అల్లాడుతున్నారు. కొత్త ప్రాజెక్టులు కడితే ఆదిలాబాద్ వ్యవసాయ రంగంలో దూసుకెళ్తుంది. రెండేళ్లలో ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు లేవని చెప్పాల్సిన అవసరం రాకూడదు. కేవలం వలస పాలకుల నిర్లక్ష్యం వల్లనే అభివృద్ధి జరగలేదు. నగేష్ నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గర మిత్రుడు. మేమంతా పాత మిత్రులమే. అంతా కలిసి ఆదిలాబాద్ జిల్లాను బంగారంగా మారుస్తాం. అటవీ ప్రాంతంలో ఉండేవారికి హెలికాప్టర్లు, అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తాం. వరంగంల్ జిల్లా కూడా వలస పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండోదశ నుంచి వరంగల్ జిల్లాకు నీళ్లు వస్తాయన్నారు కానీ రాలేదు. వరంగల్ జిల్లా కోసం రెండు ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సి ఉంది. ఆ నీళ్లపై వరంగల్ జిల్లాకు హక్కు ఉంది. వరంగల్ జిల్లాకు గోదావరి నీళ్లు కూడా వస్తాయి. తెలంగాణలో ఆంధ్రా పార్టీలు అవసరం లేవు. నాకు ఇరువైపులా ఉన్నవాళ్లిద్దరూ గిరిజన బిడ్డలే. ఒకరు గోండు, మరొకరు లంబాడా. తెలంగాణ వస్తే అందరికన్నా ఎక్కువ లాభపడేది గిరిజనులే'' అని కేసీఆర్ చెప్పారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించి, చదువుకున్న వాళ్లెవరూ నిరుద్యోగులుగా మిగలకుండా చేస్తామన్నారు. తండాలన్నింటినీ గ్రామపంచాయతీలుగా మారుస్తామన్నారు.
Published Mon, Mar 3 2014 5:25 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
Advertisement