వైఎస్ఆర్సీపీ తెలంగాణ కమిటీ నాయకురాలు వైఎస్ షర్మిల డిసెంబర్ 8వ తేదీ నుంచి మహబూబ్నగర్ జిల్లాలో పరామర్శ యాత్ర చేస్తారని పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాల దగ్గరకు ఆమె వెళ్తారని, మొత్తం 16 కుటుంబాల వారిని పరామర్శిస్తారని చెప్పారు. వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వడమే వైఎస్ షర్మిల పర్యటన ప్రధానోద్దేశమన్నారు. అనివార్య కారణాల వల్ల ఖమ్మం మినహా మిగిలిన జిల్లాల్లోనూ వైఎస్ జనగ్ ఓదార్పు యాత్ర జరగలేదని, ఆయన వెళ్లలేకపోయిన జిల్లాలకు వైఎస్ షర్మిల వెళ్తారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పాలమూరు మినమా మిగిలిన జిల్లాల్లో జనవరి నుంచి పరామర్శ యాత్ర ఉంటుందని ఆయన వివరించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, విషజ్వరాలతో ప్రజలు మరణిస్తున్నారని , ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ చర్చించిందని పొంగులేటి తెలిపారు. తాము అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా రాష్ట్ర కమిటీ చర్చించిందన్నారు.