ఈరోజు కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో పాదయాత్ర సాగింది. మంత్రి గారు, ఆయన అనుచరుల అరాచకాల మీద రోజంతా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిన్న రాత్రి బస చేసిన రైస్‌మిల్ యజమాని, ఆయన కుటుంబీకులు వచ్చి కలిశారు. బసకు చోటిచ్చినందుకు వారింటికి వెళ్లి మరీ బెదిరించారట. మిల్లును, వ్యాపారాన్ని దెబ్బ కొడతామని హుంకరించారట. అయినా అభిమానం ముందు ఆ బెదిరింపులేవీ పనిచేయలేదు. మంత్రి గారి స్వగ్రామం నిమ్మాడ గ్రామస్తులు కలిశారు. నిరుపేద ఎరకయ్యకు ఉన్న ఒకే ఒక ఎకరా భూమికి దారి లేకుండా చేసి సెల్‌ఫోన్ టవర్ పెట్టి సొమ్ము చేసుకుంటున్నారట. మంత్రి గారి అడుగులకు మడుగులొత్తలేదని అదే గ్రామంలో 20 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారట. వారితో ఎవరూ మాట్లాడకూడదు.. వారి భూములెవ్వరూ సాగు చేయకూడదు. అమ్మరాదు.. కొనరాదు. ఎటువంటి వ్యాపారాలూ చేయరాదు. ఆఖరికి చాకలి, మంగలి కూడా వెళ్లకుండా ఆంక్షలు విధించారట. ఏ పథకాలు అందకుండా చేయడం, బతుకుదెరువే లేకుండా చేయాలనుకోవడం విస్మయం కలిగించింది.