దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలివన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయ దుంధుంబి మోగించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 270 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లిసేన ఆరంభంలోనే ఓపనర్లు రోహిత్ శర్మ(20), ధావన్(35) వికెట్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి రహానేతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కోహ్లి తన కెరీర్‌లో 33వ సెంచరీని 106 బంతుల్లో పూర్తి చేశాడు. సెంచరీతో కదంతొక్కిన సారథి విరాట్ కోహ్లికి మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ వరించింది.
రహానే కూడా నెమ్మదిగా బౌండరీలు కొడుతూ క్రీజులో పుంజుకున్నాడు. రహానే(79) వ్యక్తిగత పరుగుల వద్ద ఫెలూక్వాయో వేసిన 43 ఓవర్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత అల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యా కోహ్లితో జత కట్టాడు. విరాట్ తన అద్భుతమైన ఆట తీరుతో అందర్నీ అకట్టుకున్నాడు. కోహ్లి 112(119) వ్యక్తిగత పరుగుల వద్ద ఫెలూక్వాయో వేసిన 45 ఓవర్‌లోనే మూడో బంతికి రబడాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని విన్నింగ్ షాట్ ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 45.3 ఓవర్లలో విజయలక్ష్యాన్ని ఛేదించింది. దక్షిణాఫ్రికాలో బౌలర్లలో ఫెలూక్వాయోకు రెండు వికెట్లు, మోర్నీ మోర్కెల్‌కు ఒక వికెట్ దక్కాయి.