పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మైదానంలో క్రీడాస్పూర్తి మరిచి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెటర్‌నని, ఓ జట్టు కెప్టెన్ అనే సోయి లేకుండా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియా పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ పెహ్లువాకియా దాటికి 203 పరుగులకే కుప్పకూలింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సఫారి జట్టు మళ్లీ పెహ్లువాకియా(69 నాటౌట్)నే ఆదుకొని విజయాన్నందించాడు. అయితే సఫారీ ఇన్నింగ్స్ 37 ఓవర్‌లో పెహ్లువాకియా బ్యాటింగ్‌తో తీవ్ర అసహనానికి గురైన సర్ఫరాజ్ అహ్మద్ నోటికి పనిచెబుతూ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. పెహ్లువికియా బ్యాటింగ్ చేస్తుండగా వికెట్ల వెనుక ఉర్దూలో అత్యంత జుగుప్సాకరంగా కామెంట్ చేశాడు. ‘ ఏ నల్లోడా.. మీ అమ్మ ఎక్కడ కూర్చుంది. నీకు ఏం కావాలని ఆమెను ప్రార్థించమన్నావ్?’ అంటూ ఒళ్లు మరిచి మాట్లాడాడు.