బీజింగ్ : భవనం రెండవ అంతస్తుపై నుంచి కిందకు వేలాడుతున్న పిల్లాడిని రక్షించటానికి ఓ డెలివరీ బాయ్ తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. ఎలాంటి రక్షణ లేకుండా రెండు అంతస్తులను చకచకా ఎక్కి పిల్లాడిని కాపాడాడు. ఈ సంఘటన చైనాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం చైనా, గాంగ్‌ఝౌ ప్రాంతంలోని ఓ భవనం రెండవ అంతస్తులో ఆడుకుంటున్న పిల్లాడు పొరపాటున రక్షణ చువ్వలను దాటుకుని కిందకు వేలాడాడు. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు బాలుడ్ని పైకి లాగటానికి ప్రయత్నించారు. కానీ, కుదరలేదు. చివరకు పట్టుతప్పిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటుగా వెళుతున్న లి జియాజున్ అనే డెలివరీ బాయ్ వెంటనే రెండు అంతస్తులపైకి ఎగబాకాడు.
పిల్లాడిని పట్టుకుని పైకి తోసాడు. కుటుంబసభ్యులు చిన్నారిని పైకి లాక్కోవడంతో గండం తప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో నెటిజన్లు.. ‘‘రియల్ హీరో.. డెలివరీ బాయ్ నిజంగా దేవుడు’’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం‘‘ చైనా కరోనాను వ్యాప్తి చేసిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మమ్మల్ని డైవర్ట్ చేయటానికి మంచి ప్రయత్నమే చేశారు’’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు.