Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Narendra Modi Speak About Indian Air Force in Adampur Air Base1
ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానం: ప్రధాని మోదీ

ఆదంపూర్‌: భారత్‌ మాతాకీ జై.. ఇది దేశ ప్రజల నినాదం అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యుద్ధ రంగంలో సైనికులు భారత్‌ మాతాకీ జై అంటే.. శత్రువు వెన్నులో వణుకు పుట్టడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సిందూర్ తరువాత మంగళవారం ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లారు. అక్కడ వాయుసేన సేవలను ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ తన సత్తా చూపించిందని అన్నారు. భారత్ మాతాకీ జై.. ఇది దేశ ప్రజల నినాదం అని అన్నారు. యుద్ధ రంగంలో మన సైనికులు చరిత్ర సృష్టించారని అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ అనేది ప్రపంచమంతా మార్మోగిందని, ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.నా జీవితం ధన్యమైంది‘దేశ ప్రజలంతా సైన్యానికి అండగా నిలబడ్డారు. భారత్ శక్తి సామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైంది. మన సైన్యం సామర్థ్యం భావి తరాలకు స్ఫూర్తిదాయకం. వీర సైనికులందరికీ నా సెల్యూట్. ఆపరేషన్ సిందూర్ నినాదం ప్రపంచమంతా మారుమ్రోగింది. సైన్యం దేశ ఆత్మ విశ్వాసం పెంచింది. ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సిద్ధాంతం. అక్క చెల్లెల సిందూరం తుడిచినవారిని నాశనం చేశాం’ అని మోదీ సైన్యాన్ని కొనియాడారు.‘గురిచూసి కొట్టిన దెబ్బతో.. శత్రు స్థావరాలు మట్టిలో కలిశాయి. వారు వెనుక నుంచి దాడి చేస్తే.. మీరు ముందు నిలబడి ధైర్యంగా దాడిచేశారు. పాకిస్తాన్ డ్రోన్స్, యూవీఏలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు మన రక్షణ వ్యవస్థ ముందు నిలబడలేకపోయాయి. పాక్ శత్రువులు పౌరులను అడ్డుపెట్టుకుని దాడులకు పాల్పడింది. కానీ మీరు మాత్రం పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా శత్రువును దెబ్బకొట్టారు. అణు బ్లాక్ మెయిల్‌ను భారత్ ఎప్పటికీ సహించదు. మళ్ళీ ఉగ్రదాడి జరిగితే.. భారత్ కచ్చితంగా సమాధానం ఇస్తుంది. ప్రతి కుటుంబం మీకు రుణపడి ఉంటుంది’ అని మోదీ పేర్కొన్నారు.#WATCH | At the Adampur Air Base, PM Narendra Modi said, "Besides manpower, the coordination of machine in #OperationSindoor was also fantastic. Be it India's traditional air defence system which has witnessed several battles or our Made in India platforms like Akash - all of… pic.twitter.com/Y2dYnanFmN— ANI (@ANI) May 13, 2025

YS Jagan To Visit Kallittanada In Sri Sathya Sai District Updates2
వీరజవాన్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ జగన్‌

శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్‌ ముడావత్‌ మురళీ నాయక్‌ కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు.మురళీనాయక్‌ అందరికీ స్ఫూర్తిదాయకం..పరామర్శ అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్‌ వీరమరణం పొందారని.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీనాయక్‌ అందరికీ స్ఫూర్తిదాయకం. మురళీ త్యాగానికి మనమంతా రుణపడి ఉంటాం. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీనాయక్‌ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తాం. మురళీ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా గంటలకు కల్లితండాకు చేరుకున్నారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్‌ మురళీనాయక్‌ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శించిన వైఎస్‌ జగన్‌.. అనంతరం తిరుగు పయనమయ్యారు.

Ys Jagan Announces Financial Assistance Of Rs 25 Lakh To Murali Naik Family3
వీర జవాన్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం: వైఎస్‌ జగన్‌

శ్రీసత్యసాయి జిల్లా: వీర జవాన్‌ మురళీ నాయక్‌ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం ఆయన గోరంట్ల మండలం కల్లితండాలో వీర జవాన్‌ మురళీనాయక్‌ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీర జవాను మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం అని.. ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు.జవాను చనిపోతే రూ. 50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ. 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్‌ వీరమరణం పొందారని.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Encounter In Jammu And Kashmir's Shopian District4
జమ్మూకశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. షోపియాన్‌ జిల్లాలో మంగళవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ల‌ష్క‌రే తోయిబాకి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతయ్యారు. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో.. ఒక ఉగ్రవాది పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాదేనన్న అనుమానం నెలకొంది. మరోవైపు, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గురించి సమాచారం అందించాలని ప్రజలను కోరుతూ పోలీసులు జమ్మూకశ్మీర్‌లోని షోపియన్ జిల్లా అంతటా పోస్టర్లను అతికించారు. ఈ పాకిస్తానీ ఉగ్రవాదుల గురించి నిర్ధిష్ట సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల బహుమతి అందిస్తామని పోస్టర్లలో పేర్కొన్నారు.ఈ క్రమంలో ఉగ్రవాదులపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు షోపియాన్‌ జిల్లాలో మొహరించారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో ఓ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం వేటని ముమ్మరం చేశాయి. #BREAKING: J&K Police has pasted Posters across Shopian district of Jammu & Kashmir urging people to provide information of those terrorists involved in Pahalgam terror attack.Rs 20 lakh reward to the person who will provide any information about these Pakistani terrorists. pic.twitter.com/zjV7VUWtFb— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 13, 2025

RCB: Many Key Players To Miss IPL 2025 Reschedule5
ఐపీఎల్‌ 2025 రీ షెడ్యూల్‌.. దారుణంగా నష్టపోనున్న ఆర్సీబీ

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్‌ 2025 వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఐపీఎల్‌ పునఃప్రారంభానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. మే 8న రద్దైన ఐపీఎల్‌ 2025, మే 17 నుంచి పునఃప్రారంభం కానుంది. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ నిన్న రాత్రి ప్రకటించింది. మే 8న 10 ఓవర్ల పాటు సాగి రద్దైన ఢిల్లీ, పంజాబ్‌ మ్యాచ్‌ ఈ నెల 24న మొదటి నుంచి నిర్వహించనున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌కు నిన్న ప్రకటించిన రీ షెడ్యూల్‌కు చాలా తేడాలున్నాయి. వేదికలు చాలా వరకు మారాయి. ప్లే ఆఫ్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌ల వేదికలు ఖరారు కావాల్సి ఉంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ జూన్‌ 3న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2025 వాయిదా పడటం ప్లే ఆఫ్స్‌కు అతి చేరువలో ఉన్న ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టింది. ఆ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండటం, గాయాల బారిన పడటంతో జట్టును వీడనున్నారు. ఐపీఎల్‌ వాయిదాకు ముందే ఆ జట్టు కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ గాయపడ్డారు. పాటిదార్‌ ఐపీఎల్‌ పునఃప్రారంభం తర్వాత కూడా కొన్ని మ్యాచ్‌లు మిస్‌ అవుతాడు. పాటిదార్‌ స్థానంలో కొన్ని మ్యాచ్‌లకు విరాట్‌ కోహ్లి లేదా జితేశ్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.రీ షెడ్యూల్‌లో ఆర్సీబీ ఆడబోయే మ్యాచ్‌లకు ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు. ఐపీఎల్‌ పూర్తికాక ముందే (మే 29) ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య వన్డే సిరీస్‌ మొదలవుతుంది. ఐపీఎల్‌ పూర్తైన వారం రోజులకే (జూన్‌ 11) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో నాలుగు జట్లకు చెందిన ఆటగాళ్లు ఆర్సీబీ ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు.ఆర్సీబీ జట్టులో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు: ఫిల్‌ సాల్ట్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జేకబ్‌ బేతెల్‌వెస్టిండీస్‌ ఆటగాళ్లు: రొమారియో షెపర్డ్‌మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐపీఎల్‌ ఫైనల్‌ తర్వాత వారం రోజుల సమయమున్నా (డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం).. ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఐపీఎల్‌ ఆడటం​ ఆటగాళ్ల చాయిస్‌కే వదిలిపెట్టింది. దీంతో ఆ దేశ టెస్ట్‌ జట్టులో కీలక సభ్యుడైన జోష్‌ హాజిల్‌వుడ్‌ తదుపరి ఐపీఎల్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం దాదాపు అసాధ్యమేనని తెలుస్తుంది. హాజిల్‌వుడ్‌ పోతే ఎంగిడి ఉన్నాడులే అనుకుంటే అతను కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌నే తన మొదటి ఛాయిస్‌గా ఎంచుకోవచ్చు.ఈ లెక్కన చూస్తే ఆర్సీబీలో టిమ్‌ డేవిడ్‌ మినహా ఒక్క విదేశీ ఆటగాడు కూడా మిగిలే అవకాశం లేదు. శ్రీలంక పేసర్‌ నువాన్‌ తుషార ఉన్నా అతను ఏ మేరకు అందుబాటులో ఉంటాడో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. మొత్తంగా చూస్తే, ప్రస్తుత సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీని ఐపీఎల్‌ వాయిదా పడటం దారుణంగా దెబ్బకొట్టింది. ఆ జట్టు తదుపరి మ్యాచ్‌ల్లో కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోతే లయ తప్పే ప్రమాదముంది. ఈ సీజన్‌పై ఆ జట్టు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి, ఆ ఫ్రాంచైజీ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సాలా కప్‌ నమ్మదే అని ఆర్సీబీ అభిమానులు ఇప్పుడిప్పుడే నమ్మడం మొదలుపెట్టారు. ఈ లోపే భారత్‌, పాక్‌ మధ్య యుద్దం మొదలై ఆర్సీబీ గెలుపు జోష్‌ను దెబ్బకొట్టింది. మరి, ఉన్న వనరులతో ఆర్సీబీ మున్ముందు మ్యాచ్‌ల్లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఐపీఎల్‌ వాయిదాకు ముందు ఆర్సీబీ జట్టు..రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, స్వస్థిక్‌ చికారా, మయాంక్‌ అగర్వాల్‌, టిమ్‌ డేవిడ్‌, కృనాల్‌ పాండ్యా, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, మనోజ్‌ భాండగే, జేకబ్‌ బేతెల్‌, రొమారియో షెపర్డ్‌, స్వప్నిల్‌ సింగ్‌, మోహిత్‌ రాఠీ, ఫిల్‌ సాల్ట్‌, జితేశ్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, యశ్‌ దయాల్‌, సుయాశ్‌ శర్మ, లుంగి ఎంగిడి, రసిఖ్‌ దార్‌ సలామ్‌, నువాన్‌ తుషార, అభినందన్‌ సింగ్‌ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒ‍క్క మ్యాచ్‌ గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.

Samantha Subham Movie Box Office Collection Details6
సమంత కొత్త జర్నీ.. సక్సెస్‌ అయినట్లేనా?

స్టార్‌ హీరోయిన్‌ సమంత(samantha) కొత్త జర్నీ ప్రారంభించింది. ఇన్నాళ్లు తన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ..ఇప్పుడు నిర్మాతగా మారి మంచి సినిమాలను ప్రేక్షకులను అందించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ స్థాపించి, ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు మంచి టాక్‌ సంపాదించుకొని బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది.మూడు రోజుల్లో 5.25 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌తో పోలిస్తే..ఇది మంచి నెంబరనే చెప్పాలి. ఓవరాల్‌గా ఈ చిత్రానికి రూ. 3.5 కోట్ల బడ్జెట్‌ అయినట్లు సమాచారం. రిలీజ్‌కి ముందే సమంత తనకున్న పలుబడితో టేబుల్‌ ప్రాఫిట్‌ని పొందినట్లు తెలుస్తోంది.ఈ సినిమా ఓటీటీ రైట్స్‌, శాటిలైట్‌ హక్కులను మంచి రేటుకే అమ్మేసిందట. షూటింగ్‌కి ముందే ‘జీ’ సంస్థతో డీల్‌ కుదుర్చుకుందట సమంత. సినిమా మొత్తం ఓ సీరియల్‌ చుట్టు తిరుగుతుంది.. అది జీ టీవీలో ప్రసారం అయ్యే సీరియల్‌గా చూపిస్తామని ‘బ్రాండింగ్’మాట్లాడుకున్నారట. ఆ తర్వాత అదే సంస్థ ఓటీటీ, శాటిలైట్‌ హక్కులను దక్కించుకుంది. నిజానికి ఇలాంటి చిన్న సినిమాకి రిలీజ్‌ ముందే బిజినెస్‌ జరగడం చాలా అరుదు. పెద్ద పెద్ద సినిమాలకే ఓటీటీ బిజినెస్‌ కావడం లేదు. సమంత ఉంది కాబట్టే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ రిలీజ్‌కి ముందే సేల్‌ అయ్యాయి. ఇక రిలీజ్‌ తర్వాత మంచి టాక్‌ రావడం.. వసూళ్లు రోజు రోజుకి పెరగడంతో ‘శుభం’తో సమంతకు మంచి లాభాలే వచ్చేశాయి. మొత్తానికి సమంత కొత్త జర్నీ లాభాలతోనే ప్రారంభం అయింది. భవిష్యత్తులో ఆమె బ్యానర్ నుంచి మరిన్ని క్వాలిటీ సినిమాలు, బలమైన కథలతో వస్తే, 'సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్'గా గుర్తింపు పొందే అవకాశం ఉంది.

Swiggy Delivery Agent With 2 Year Old Daughter Internet reacts  7
తల్లిని పోగొట్టుకున్న రెండేళ్ల చిన్నారితో..ఎంత కష్టం : డెలివరీ ఏజెంట్‌ స్టోరీ

భార్యాభర్తల్లో ఒకరు చనిపోయినపుడు మిగిలిన భాగస్వాముల జీవితం దుర్భరమే అవుతుంది. అయితే చాలా సందర్భాల్లో భార్య చనిపోయినపుడు భర్త రెండోపెళ్లి చేసుకోవడం, ఇంటి బాధ్యతలతోపాటు, మొదటి భార్య సంతానాన్ని పెంచే బాధ్యత కూడా రెండో భార్యకు అప్పగించడం లాంటివి చూస్తాం.కానీ స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసే వ్యక్తి ఇందుకు భిన్నం. తన రెండేళ్ల కూతురిని చూసుకుంటూ డెలివరీలు చేస్తున్న కథనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌ గా మారింది. వేలాది మంది హృదయాలను కదిలించింది.గురుగ్రామ్‌కు చెందిన స్విగ్గీ డెలివరీ ఏజెంట్ పంకజ్. భార్య చనిపోయిన తరువాత తన తన రెండేళ్ల కుమార్తె టున్ టున్ తల్లిలేని బిడ్డగా మారిపోయింది. కానీ పంకజ్‌ బిడ్డను ఒంటరిగా వదిలేయలేదు. స్వయంగా తనే తన పాపాయిని చూసుకుంటున్నాడు. టున్‌టున్‌ను వెంటబెట్టుకుని మరీ డెలివరీలు చేస్తున్నాడు. ఆమెను చూసుకోవడానికి మరెవరూ లేకపోవడం, పెద్ద కొడుకుసాయంత్రం తరగతులకు హాజరుకావడంతో పంకజ్‌కు మరే మార్గం కనిపించలేదు. ఇదీ చదవండి: కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్‌ వీడియోగురుగ్రామ్‌కు చెందిన సీఈవో మయాంక్ అగర్వాల్ తన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో డెలివరీ ఏజెంట్ పంకజ్ వెలుగులోకి వచ్చాడు.మయాంక్‌ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత డెలివరీ ఏజెంట్‌ పంకజ్‌కు కాల్ చేయగా.. అవతలినుంచి ఒక చిన్నారి వాయిస్‌ కూడా వినిపించడంతో, పైకి రమ్మని చెబుతామని కూడా ఆగిపోయి, స్వయంగా తానే కిందికి వెళ్లాడు. అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. బైక్‌పై ఫుడ్ డెలివరీ ఏజెంట్ పంకజ్‌తో పాటు అతని రెండేళ్ల పాపాపయి కూడా. దీంతో పంకజ్‌ను ఆరా తీసి, అసలు సంగతి తెసుకుని మయాంక్ భావోద్వేగానికి లోనయ్యాడు.తన అనుభవాన్ని మయాంక్ లింక్డ్ ఇన్‌లో షేర్ చేశాడు. అసలేం జరిగిందంటేడెలివరీ ఏజెంట్‌గా చేస్తున్న పంకజ్‌కు ఇద్దరు పిల్లలు. రెండో బిడ్డ టున్‌ టున్‌ పుట్టగానే భార్య కాన్పు సమయంలో చనిపోయింది. అప్పటినుంచి అన్నీ తానై అయ్యి బిడ్డలను సాదుకుంటున్నాడు. కొడుకు కాస్త పెద్దవాడు కావడంతో అతన్ని సాయంత్రంపూట ట్యూషన్లకు పంపుతున్నారు. కూతురు చిన్నది కావడంతో తనతోపాటే తీసుకెళ్లి, బైకు మీద కూర్చో బెట్టుకొని స్విగ్గీలో డెలివరీ ఏజెంట్‌ విధులను నిర్వరిస్తున్నాడు. ఇది చాలా రిస్క్‌తో కూడినదే కానీ కానీ పనిచేయకపోతే బతుకు దెరువు కష్టం కదా అన్న పంకజ్ మాటలు పలువుర్ని ఆలోచింప చేస్తున్నాయి. చాలా రిస్క్‌ బాస్‌ అంటూ కొందరు విమర్శిస్తుండగా, శభాష్‌, హాట్సాఫ్‌ పంకజ్‌ అంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే గిగ్ వర్కర్ల కనిపించని కష్టాలు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.ఇంకొందరు అతనికి సాయం చేసేందుకు ముందుకు వస్తుండటం విశేషం.చదవండి: పానీ పూరీ తినడం నేర్చుకున్న అందాల సుందరి ఎవరంటే..!

Relief For Mp Mithun Reddy In Supreme Court In Liquor Policy Case8
సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట

ఢిల్లీ: మద్యం విధానం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా విచారణ జరపాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మెకానికల్ అరెస్టులు సరికాదని ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు హితవు పలికింది. హైకోర్టు నిర్ణయం తీసుకునేంతవరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.‘‘గత విచారణ సందర్భంగా ఈ కేసులో ఆధారాలను హైకోర్టు సరిగ్గా పరిశీలించలేదు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను మరోసారి హైకోర్టు పరిశీలించాలి. దర్యాప్తు అధికారి సేకరించిన మెటీరియల్ హైకోర్టు చూడాలి. ఈ కేసులో పిటీషనర్ పాత్రకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందుబాటులో లేదు. అరెస్ట్‌కు సహేతుక కారణాలు చూపించాలి. మెకానికల్ అరెస్టులు సరికాదు. కేసు పెట్టిన వెంటనే అరెస్టు చేయాలని యోచన సరికాదు’’ అని సుప్రీంకోర్టు తెలిపింది.‘‘పార్లమెంట్ సభ్యుడి పరువు ప్రతిష్టలను పరిగణలోకి తీసుకోవాలి. తాజాగా మరోసారి పిటిషన్ హైకోర్టు విచారణ చేయాలి. ఏపీ హైకోర్టు తగిన అఫిడవిట్ దాఖలు చేయాలి. హైకోర్టు నిర్ణయం తీసుకునేంతవరకు మిథున్‌రెడ్డిని అరెస్టు చేయొద్దు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Gift Free Of Charge Donald Trump Breaks Silence On Reported Qatari Jet Deal9
ఎయిర్ ఫోర్స్ వన్... ఫ్రీ!.. అమెరికా అధ్యక్షుడికి ఖతార్ గిఫ్ట్?

జనానికి ‘ఫ్రీ’ అనే పదం వినపడినంత సొంపుగా మరొకటి చెవులకు సోకదు. ఫ్రీ అంటే ఫినైల్ తాగేవాడుంటాడని ప్రతీతి. ‘ఉచితం’ దేశాధ్యక్షులకూ బహు ప్రీతి. ఈ ఉచితం... ‘ఉచితమా’? సముచితమా? కాదా? అని ఆలోచించరు. అమెరికా అధ్యక్షుడూ ఇందుకు మినహాయింపు కాదు. ‘ఉచిత’ ఎయిర్ ఫోర్స్ వన్. ఖతారోడు ఫ్రీగా జంబోజెట్ ఇస్తాట్ట. అది సూపర్ లగ్జరీ ‘బోయింగ్ 747-8’ విమానం. ‘ప్యాలెస్ ఇన్ ద స్కై’ అంటున్నారు. ‘ఆకాశంలో ఎగిరే హర్మ్యం’గా అభివర్ణిస్తున్నారు. ప్రైవేటు బెడ్రూం సూట్, బోర్డు రూమ్స్, పాలరాయితో అలంకరించిన స్నానాలగదులు, గ్రాండ్ స్టెయిర్కేస్ వంటి ఫీచర్స్ అందులో ఆ విమానాన్ని ఖతార్ ఇస్తే ట్రంప్ తీసుకోవడమేనా? ఎవడో విసిరే బిస్కట్ కోసం అగ్రరాజ్యం అంతగా కక్కుర్తిపడుతోందా?అమెరికా అంతర్జాతీయ పేరు ప్రతిష్ఠలు కేవలం ‘విమానాల సేకరణ’ స్థాయికి దిగజారిందా? ఖతార్ రాజకుటుంబం ఇచ్చే బహుమతిని అమెరికా అధ్యక్షుడు పుచ్చుకోవడం అనైతికం, చట్ట విరుద్ధం అంటున్నారు విమర్శకులు. పైగా భద్రత పరంగా కూడా ప్రమాదకరమని విశ్లేషిస్తున్నారు. సొంత పార్టీ రిపబ్లికన్ల నుంచే వ్యతిరేకత వస్తోంది. ఆ విమానం ధర 400 మిలియన్ డాలర్లు. అంటే రూ.3,400 కోట్లు. అయితే ఖతార్ గిఫ్టుగా ఇచ్చే విమానంలో తాను తిరగబోనని చెబుతున్నారు ట్రంప్. గతంలో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ వాడిన బోయింగ్ 707 విమానాన్ని సేవల నుంచి తప్పించి మ్యూజియంలో ఓ వస్తువుగా ప్రదర్శనకు పెట్టినట్టే... తన పదవీకాలం ముగిశాక భవిష్యత్తులో ‘ప్రెసిడెంట్ లైబ్రరీ’కి ఆ విమానాన్ని దానంగా ఇస్తామని అంటున్నారు ట్రంప్.అధ్యక్షుడిగా తన పదవీకాలం పూర్తవగానే అది ప్రెసిడెంట్ లైబ్రరీకి వెళ్లిపోతుందని ఆయన వివరించారు. ఇక అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విషయానికొస్తే.. అవి రెండు విమానాలు. దాదాపు 40 ఏళ్లుగా వాటిని అమెరికా వినియోగిస్తోంది. భద్రతపరంగా అవి మేలైనవి. కమ్యూనికేషన్ సామర్థ్యాలు, క్షిపణి దాడుల నుంచి కాచుకోవడం, గాల్లోనే ఇంధనం నింపుకోవడం వంటి ఫీచర్స్ వాటి సొంతం. అయితే ఆ పాత, డొక్కు విమానాలు అధ్యక్షుడికి నచ్చడం లేదు. వాటిని మార్చాలని ట్రంప్ ఉత్సాహపడుతున్నారు. బోయింగ్ కూడా అదే పనిలో నిమగ్నమైంది. రష్యాకు చెందిన ఓ విమానయాన సంస్థ కోసం బోయింగ్ గతంలో 747 విమానాలు తయారుచేసింది.బోయింగ్ నుంచి విమానాలు కొంటామన్న రష్యన్ విమానయాన సంస్థ ప్రస్తుతం ఉనికిలో లేదు. దీంతో ఆ 747 విమానాలకు బోయింగ్ మార్పుచేర్పులు చేస్తూ అదనపు సొబగులు అద్దుతోంది. కీలక సబ్ కాంట్రాక్టర్ దివాలా తీయడం, అర్హత గల సిబ్బంది కొరత కారణాల నేపథ్యంలో సుమారు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ ‘747 విమానాల మేకప్ తతంగం’ ఇంకొన్నాళ్లు పట్టేట్టుంది. ట్రంప్ ప్రస్తుత రెండో టర్మ్ ముగిసేలోపు ఆ విమానాలు సిద్ధమయ్యేట్టు లేవు. దీంతో దేశాధ్యక్షుడిలో అసహనం పెరిగిపోతోంది. కొందరు అరబ్ నేతలు ‘ఎయిర్ ఫోర్స్ వన్’ కంటే మెరుగైన విమానాల్లో ప్రయాణిస్తున్నారంటూ ట్రంప్ ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. మధ్యప్రాచ్యంలో ఖతార్ గడ్డపై అమెరికాకు అతి పెద్ద సైనిక స్థావరం ఉంది.ప్రస్తుతం ట్రంప్ అటువైపే పర్యటనకు బయల్దేరారు. మే 13-16 తేదీల్లో ఆయన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈల్లో పర్యటిస్తారు. కొసమెరుపు- ‘కాంగ్రెస్ (చట్టసభలు) అనుమతి లేకుండా ఫెడరల్ అధికారులు విదేశీ ప్రభుత్వాల నుంచి విలువైన వస్తువులు, లాభాలు/ప్రయోజనాలు పొందరాదు’ అని అమెరికా రాజ్యాంగం స్పష్టీకరిస్తోంది. మరి ‘ఖతార్ గిఫ్ట్’ అంశంలో ట్రంప్ ఏం చేస్తారో! అధ్యక్షుడైనా చట్టానికి అతీతం కాదు. విమానాన్ని అమెరికా అధ్యక్షుడికి బహుమతిగా ఇవ్వజూపడం వెనుక ఖతార్ ప్రయోజనాలు ఏం దాగున్నాయో!::జమ్ముల శ్రీకాంత్‌(Source: Huffpost, American Broadcasting Company news)

Today gold and silver rates in Telugu states10
పడి లేచిన పసిడి ధరలు! తులం ఎంతంటే..

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిన్నటి మార్కెట్‌ సెషన్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు తిరిగి స్వల్పంగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,650 (22 క్యారెట్స్), రూ.95,620 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.150, రూ.160 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.150, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.160 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,650 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,620 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.150 పెరిగి రూ.87,800కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.160 పెరిగి రూ.95,770 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా మంగళవారం వెండి ధర(Silver Prices)లు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,09,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement