
ఢిల్లీ: లోక్‌సభను ఏ సభ్యుడైనా తప్పుదోవ పట్టించాలని చూస్తే.. సభ నియమ, నిబంధనల నుంచి తప్పించుకోలేరని పార్లెమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ప్రసంగంలో అన్నీ అసత్య ఆరోపణలు ఉన్నాయని స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కిరణ్ రిజిజు వ్యాఖ్యలను ప్రాధాన్యత సంతరించుకుంది.
‘‘లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చాలా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని మేము స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చాం. స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఎదురు చూస్తున్నాం. సభలో అందరీకి సమానమైన నియమాలు ఉంటాయి. స్పీకర్ కంటే ఎవరూ పెద్ద కాదు. సభ నియమాలను నుంచి ఏ సభ్యుడు తప్పించుకోలేరు. గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు భావిస్తే.. సభలో అటువంటి ప్రాధాన్యతలు ఉండవు. ఎవరైనా సభను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తే.. వాళ్లు సభ నియమాలను నుంచి తప్పించుకోలేరు’’ అని మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
సోమవారం రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పలు అంశాల్లో బీజేపీ, మోదీ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై సభలో ప్రధానితో సహా మంత్రులు అభ్యంతరం తెలిపారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రభుత్వం, బీజేపీపై అసత్య ఆరోపణలు చేశారని బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చారు.