బోట్‌క్లబ్ (కాకినాడ) :లక్ష్యం మంచిదే అయినా అమలులో చిత్తశుద్ధి లోపించి ఈ-పంచాయతీ పథకం అటకెక్కింది. గ్రామ పంచాయతీల్లో అన్ని రకాల సర్టిఫికెట్ల జారీని పారదర్శకంగా చేయాలనే సంకల్పంతో లక్షల రూపాయల వ్యయంతో ప్రవేశపెట్టిన ఈ పథకం కంప్యూటర్లు మూలనపడ్డాయి. పంచాయతీల్లో జనన, మరణ ధృవపత్రాలు సకాలంలో అందించాలని ఆరు నెలల క్రితం ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అన్ని పంచాయతీలకూ కంప్యూటర్లు, స్కానర్‌లు అందించిన అధికారులు కొన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించలేదు. ఫలితంగా కంప్యూటర్ ఆపరేటర్లు చేసే పనిలేక గోళ్లు గిల్లుకుంటున్నారు. పంచాయతీల ద్వారా ధృవపత్రాలు జారీకి కావల్సిన సాఫ్ట్‌వేర్ ఇంతవరకూ రూపొందించకపోవడం పథకంపై యంత్రాంగానికి ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. ఒక్కో పంచాయతీకి రూ.లక్ష వెచ్చించి కంప్యూటర్, స్కానర్, ప్రింటర్, జిరాక్స్, యూపీఎస్ వంటి సౌకర్యాలు కల్పించారు. ఇవన్నీ ఉన్నా బ్రాడ్‌బ్రాండ్ లేకపోవడంతో కంప్యూటర్లకు పని లేక మూలనపడ్డాయి.
బాడ్ బ్రాండ్ ఇక్కట్లు...
సాంకేతిక పరిజ్ఙానం ద్వారా ప్రజలకు మేలైన పాలన అందించాలనే ఉద్దేశంతో గత జూన్‌లో ఈ- పంచాయతీని ప్రారంభించారు. జిల్లాలో వెయ్యికి పైగా పంచాయతీలుండగా వాటిని క్లస్టర్లుగా మార్చి, 729 పంచాయతీలుగా విభజించారు. ప్రాథమికంగా 549 పంచాయతీల్లో ఈ-పంచాయతీని అమలు చేశారు. వీటిలో 363 పంచాయతీలకు బీఎస్‌ఎన్‌ఎల్ నెట్ కనెక్షన్ అందచేశారు. మిగిలిన వాటికి ఆ కనెక్షన్ ఇవ్వకపోవడంతో కంప్యూటర్లు మూలన పడ్డాయి. వీటి నిర్వహణ కార్వే అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించగా గత జూన్ నుంచి నెలకు రూ.7000 చొప్పున వేతనంతో ఆపరేటర్లను నియమించారు. అప్పటి నుంచి వారు వేతనాలు పొందుతున్నారే తప్ప చేసే పనిలేక ఖాళీగా ఉంటున్నారు. ఈ-పంచాయితీకు ఇంటర్నెట్ బ్రాడ్ బ్రాండ్ సౌకర్యం అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ఒప్పందం కుదుర్చుకున్నా క్షేత్రస్థాయిలో ఇబ్బందులతో ఇవ్వలేకపోతోంది. కొన్ని చోట్ల లైన్లు లేకపోవడంతో ఇంటర్నెట్ సౌకర్యం ఇవ్వలేకపోతున్నామని, ఇందులో తమ తప్పేమీ లేదని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు చెబుతున్నారు. సామర్లకోట మండలం చంద్రంపాలెం, ఉండూరు పంచాయితీలకు కంప్యూటర్లు సమకూర్చినా.. నెట్ సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి. ఆ ప్రాంతాలకు లైన్లు వేయడానికి రైల్వే ట్రాక్ అడ్డురావడంతో బీఎస్‌ఎన్‌ఎల్ చేతులెత్తేసింది.
ధృవీకరణ పత్రాల సాఫ్ట్‌వేర్ ఏదీ?
ఈ-పంచాయతీల నిర్వహణకు పంచాయతీరాజ్‌శాఖ ఇనిస్టిట్యూట్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ సమకూర్చింది. పంచాయతీల్లో నిర్వహణ, జమా ఖర్చులు, బిల్లుల వంటివి కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. దీని ద్వారా ఏ పంచాయతీలకు ఏ పనికి ఎంత బిల్లు చెల్లించాలో ఆన్‌లైన్ ద్వారా తెలుస్తుంది. ఈ-పంచాయతీల ద్వారా జనన, మరణ పత్రాలు, ఆస్తి విలువలు, ఆస్తిపన్ను, ఇంటి పన్ను వసూలు వంటి వివరాలన్నీ నమోదు చేయాలి. నాలుగు నెలలు దాటినా ఈ తరహా సేవలు జిల్లాలో ఎక్కడా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.
ఉండీ..లేనట్టే
Published Fri, Dec 26 2014 12:31 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
Advertisement
Advertisement