సమ్మెలో 2,200 మంది విద్యుత్ ఉద్యోగులు | 2,200 current employees' strike | Sakshi
Sakshi News home page

సమ్మెలో 2,200 మంది విద్యుత్ ఉద్యోగులు

Published Tue, Oct 8 2013 3:28 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM

2,200 current employees' strike


 సాక్షి, చిత్తూరు: రాష్ట్ర విభజనను వ్యతిరే కిస్తూ ట్రాన్స్‌కో ఉద్యోగులు చేస్తున్న మెరుపు సమ్మె రెండో రోజూ కొనసాగింది. విద్యుత్ ఉద్యోగులు సోమవారమూ సరఫరా నిలిపేసి తమ పవర్ పంచ్ చూపించారు. ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు సరఫరాను ఆపేశారు. జిల్లా మొత్తానికి హెచ్‌టీ లైన్ల నుంచి విద్యుత్ సరఫరా చేసే కలికిరి, రేణిగుంట, చిత్తూరు 220 కేవీ ప్రధాన సబ్‌స్టేషన్లను విద్యుత్ ఉద్యోగులు షట్‌డౌన్ చేశారు. జిల్లాలో హెల్పర్ల నుంచి డీఈల వరకు 2,200 మంది ఉద్యోగులు సమ్మె లో ఉన్నారు. ఫ్యూజ్‌కాల్స్, బ్రేక్‌డౌన్లు వేటికీ అటెండ్ కావడం లేదు. జిల్లాలోని 33 కేవీ సబ్‌స్టేషన్లు 295, 11కేవీ విద్యుత్ ఫీడర్లు 1100 పడకేశాయి. ప్రైవేట్ ఆస్పత్రులు, హోటల్స్, కంప్యూటర్ సెంటర్లు, జిరాక్స్ దుకాణాలు, వెల్డర్లు, పిండిమరలు, లేత్‌మిషన్లు, చిన్న పరిశ్రమలు, వాటర్‌సర్వీసు స్టేషన్లు, బేకరీల్లో  కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. రక్షిత మంచినీటి పథకాలకు మోటర్లు పనిచేయక గ్రామాల్లో జనం నీటి కోసం అవస్థలు పడ్డారు. జిల్లావ్యాప్తంగా కోట్ల రూపాయల వాణిజ్య కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి నుంచి బయల్దేరే రైళ్ల పైన విద్యుత్ సమ్మె ప్రభావం పడింది. అన్ని రైళ్లకు డీజిల్ ఇంజిన్లు తగిలించి పంపింపేందుకు ఏర్పాట్లు చేశారు. రేణిగుంట, చిత్తూరు, వెంకటగిరిలోని విద్యుత్, రైల్వేట్రాక్షన్ సబ్‌స్టేషన్లకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఆదివారం రాత్రి నుంచి కాట్పాడి (తమిళనాడు) రైల్వే ట్రాక్షన్‌కు విద్యు త్ సరఫరా తీసుకున్నారు. తిరుపతి పాస్‌పోర్టు కార్యాలయంలో పాస్‌పోర్టుల జారీ కోసం జనరేటర్లను ఏర్పాటు చేసుకున్నారు.
 
 10 మిలియన్లకు లక్ష యూనిట్లే సరఫరా
 జిల్లావ్యాప్తంగా రోజూ హెచ్‌టీ, ఎల్‌టీ సర్వీసులకు 10 మిలియన్ యూనిట్లు అవసరం కా గా లక్ష యూనిట్లు సరఫరా కావడం లేదు. విద్యుత్ ఉత్పత్తి చేసే ముద్దనూరు, విజయవాడ వీటీఎస్‌ల్లో ఉత్పత్తి స్తంభించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో సబ్‌స్టేషన్లను, ఫీడర్లను సైతం ఉద్యోగులు మూసేశారు.
 ఆస్పత్రులకు విద్యుత్ కష్టాలు జిల్లాలోని తిరుపతి, చిత్తూరులోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రులకు మాత్రం విద్యుత్ సరఫరా నిరంతరాయంగా అందే ఏర్పాట్లు చేశా రు. స్విమ్స్, రూయా, బర్డు, జిల్లా ప్రధాన ప్రభుత్వాస్పత్రులకు సరఫరా అందింది. కుప్పం, పుత్తూరు, శ్రీకాళహస్తి, నగరి ఏరియా ఆస్పత్రుల్లో సరఫరా బంద్ కావడం, జనరేటర్లు లేకపోవడంతో వైద్యసేవలకు అంత రాయం ఏర్పడింది. పట్టణాల్లో ప్రైవేట్ ఆస్పత్రులు గంటల కొద్దీ జనరేటర్లతో నిర్వహించలేక కార్యకలాపాలు వాయిదా వేశాయి.
 
 పరిశ్రమలకు దెబ్బ
 జిల్లాలోని శ్రీనిఫుడ్స్, అమరరాజ బ్యాటరీస్, ల్యాంకో ఇండస్ట్రీస్, జ్యూస్ ఫ్యాక్టరీలు, పిగ్‌ఐరెన్, చిత్తూరు గ్రానైట్ ఫ్యాక్టరీస్, గాజుల మండ్యం పారిశ్రామికవాడల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలు స్తంభించాయి. బీఎస్‌ఎన్‌ఎల్ సెల్‌టవర్లకు జనరేటర్లు పూర్తిగా నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో సిగ్నల్స్ పని చేయలేదు. వినియోగదారులు ఫోన్లు చేసుకోలేక ఇబ్బంది పడ్డారు. చిత్తూరు కేంద్రంగా ఉన్న పౌల్ట్రీ హేచరీస్‌లో కోడిపిల్లల ఉత్పత్తిపై ప్రభా వం పడింది. జనరేటర్లు ఉన్నా ఉష్ణోగ్రత అవసరమైన మేరకు నిర్వహించే పరిస్థితి లేదు.
 
 విమానాశ్రయంలో..
 రేణిగుంట, న్యూస్‌లైన్: రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 6 గంటల నుంచి కరెంటు సరఫరా నిలిపి వేశారు. టెర్మినల్ బిల్డింగ్ టెక్నికల్ బ్లాక్‌లోని ఉద్యోగులు ఎయిర్‌పోర్ట్ అగ్నిమాపక కేంద్రంలోని జనరేటర్ సాయంతో కార్యకలాపాలు నిర్వర్తించారు. సాయంత్రం వరకూ స్పైస్‌జెట్, ఎయిరిండియా,  జెట్‌లైట్ విమానాల రాకపోకలకు జనరేటర్‌తోనే సందేశాలను అందించారు.
 
 రైల్వేలో కరెంట్ ఎఫెక్ట్
 తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: కరెంటు కోతల ప్రభావం రైల్వే వ్యవస్థపైనా పడింది. తిరుపతి రైల్వేస్టేషన్‌లో రైళ్ల రాకపోకలు సూచించే డిస్‌ప్లే బోర్డులు పనిచేయక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రిజర్వేషన్ కార్యాల యం, డెప్యూటీ స్టేషన్ మేనేజర్ కార్యాలయం, ఎంక్వయిరీ కౌంటర్, బుకింగ్ కౌంటర్లు జనరేటర్ సాయంతో కొనసాగాయి. జ్యూస్ స్టాల్స్, వాణిజ్య సముదాయాలు, లిఫ్ట్‌లు, రిజర్వేషన్ విచారణ మిషన్లు పనిచేయలేదు. వెయిటింగ్ హాళ్లలో అంధకారం అలముకుంది. వెయిటింగ్ హాళ్లలో ఏసీలు పనిచేయక ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. రైల్వే స్టేషన్ నుంచి ఈస్టు పోలీసుస్టేషన్ వరకు, ఉత్తరం వైపు నాలుగు కాళ్ల మండపం వరకు అంధకారం నెలకొనడంతో యాత్రికులు ఇబ్బందిపడ్డారు. రైల్వే భద్రతా కార్యాల యాల్లో ఇంటర్నెట్ వ్యవస్థ పనిచేయకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయలేక ఇబ్బంది పడ్డారు.
 
 రెండో రోజూ డీజిల్ ఇంజన్లే
 తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రెండో రోజైన సోమవారమూ డీజిల్ ఇంజన్‌లతోనే నడిపారు. ఢిల్లీ, ముంబయి, భువనేశ్వర్ తదితర బయట రాష్ట్రాల నుంచి తిరుపతి మీదుగా నడిచే రైళ్లకు విద్యుత్ అంతరాయం లేకుండా తమిళనాడులోని కాట్పాడి నుంచి సరఫరాను రేణిగుంట వరకు ప్రత్యేక దశలో కొనసాగించారు. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం రాత్రి రద్దు చేసినట్లు స్టేషన్ మేనేజర్ కూర్మారావు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement