సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడం లక్ష్యంగా.. వారికి 20 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇచ్చేందుకు నిర్ణయించింది. దీన్ని 2018 జూలై ఒకటి నుంచి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మొత్తాన్ని ఇప్పుడు కాకుండా వచ్చే జూన్‌లో చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు మీడియాకు వెల్లడించారు. వాటిలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలివీ...
► అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు ఆదేశాలననుసరించి సత్వరం చెల్లింపులు చేయాలని నిర్ణయం.
► వైకుంఠపురం ఎత్తిపోతల పథకం నిర్మాణంపై చర్చ జరిగింది. తక్కువ ధరకు ఎవరు టెండర్లు వేస్తే వారికిచ్చేయాలని నిర్ణయం.
► జేఎన్‌టీయూ అమరావతి పేరిట కొత్త యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం. దీన్ని మోడల్ యూనివర్సిటీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
► విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలిలో 70 ఎకరాల భూమిని ఎకరా రూ.10 లక్షల చొప్పున, విశాఖ రూరల్ మండలం యెండాడ గ్రామంలో 70 ఎకరాల భూమిని ఎకరా రూ.కోటి చొప్పున అకార్డ్ యూనివర్సిటీకి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం.
► హెల్త్ సైన్సెస్ విభాగంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో కూడిన మల్టీ స్ట్రీమ్ యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయం.
► విజయనగరం విశ్వవిద్యాలయానికి గురజాడ అప్పారావు పేరు పెట్టేందుకు ఆమోదం. డిగ్రీ కళాశాల కూడా ఇవ్వాలని నిర్ణయం. విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు నిర్ణయం.
► అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులివ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
► జలవనరుల శాఖకు చెందిన భూముల్లో 2వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అంగీకారం.
► కర్నూలు జిల్లా సున్నిపెంటలో 76.4 ఎకరాలు, వెలిగోడు దగ్గర 20 ఎకరాల భూముల్లో పేదలకు పట్టాలివ్వడానికి ఆమోదం.
► కాకినాడ వెంకట్‌నగర్‌లోని 1,040 చదరపు గజాల భూమిని కల్యాణమండపం నిర్మాణంకోసం వీవర్స్ కమ్యూనిటీకి 25ఏళ్ల లీజుకివ్వాలని నిర్ణయం.
► అనంతపురం జిల్లా మడకశిర మండలంలో పరిగి, సెరికొలెం గ్రామాల్లోని 256.61 ఎకరాల భూమిని బెనిఫిసెంట్ నాలెడ్జ్ పార్కుకు ఇవ్వాలన్న ఏపీఐఐసీ ప్రతిపాదనకు అంగీకారం.
► రాజమహేంద్రవరంలోని రామకృష్ణ మఠానికి రూ.23,49,981 విలువ గల ప్రాపర్టీ టాక్స్ బకాయిల నుంచి మినహాయింపు.
► విశాఖ జిల్లా ఎండాడలో అంబేడ్కర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్మిస్తున్న భవనానికి సంబంధించి రూ.48,36,273 విలువ గల బిల్డింగ్ లైసెన్స్ ఫీజు మినహాయింపునకు ఆమోదం.
► ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం నాయునిపల్లిలో 48.53 ఎకరాల ప్రభుత్వభూమిని అఫర్డబుల్ హౌసెస్ నిర్మాణంకోసం విజయవాడలోని రాజీవ్ స్వగృహæ కార్పొరేషన్ సీఎండీకి అప్పగించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
► గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రాజాపేటలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు 6.96 ఎకరాల అగ్రి భూమి గుంటూరు టెక్స్‌టైల్ పార్క్ యాజమాన్యానికి కేటాయింపు. ఎకరాకు రూ.18,15,000 చెల్లించే షరతుపై కేటాయింపు.
► కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అమరావతి అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు బదులుగా అమరావతి అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 20 ఎకరాలు కేటాయింపు(కేవలం సంస్థ పేరులో స్వల్ప మార్పు)నకు ఆమోదం.
► ప్రకాశం జిల్లా కొండెపి మండలానికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారిణి ఎం.కళ్యాణికి ఒంగోలులో ఉచితంగా స్థలం కేటాయింపుకు నిర్ణయం.
► కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 50 ఎకరాల భూమిని.. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగానికి కేటాయింపు. సమగ్ర ఇంటెలిజెన్స్ శిక్షణ అకాడమీకోసం భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం
► ఏపీ ఎకనమిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు విజయవాడ గ్రామీణ మండలం.. జక్కంపూడి, వేమవరం గ్రామాల్లో 153 ఎకరాల భూమి కేటాయింపు. దీనిలో వేమవరంలో 60 ఎకరాలు, జక్కంపూడిలో 93 ఎకరాలున్నాయి. జక్కంపూడిలో మార్కెట్ ధర ఎకరాకు రూ.కోటి, వేమవరంలో మార్కెట్ ధర ఎకరా రూ.50 లక్షల చొప్పున ధర నిర్ధారణ.
► విజయనగరం జిల్లా కవులవాడ, రావాడ, ముంజేరు, కంచేరుపాలెం, గూడెపువలస, కంచేరు గ్రామాల్లో 500.14 ఎకరాల భూమిని భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కేటాయింపు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం బసవపాలెం గ్రామంలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు 70.18 ఎకరాల భూమి ఏపీఐఐసీకి ఉచితంగా అప్పగించేందుకు నిర్ణయం.
► అనంతపురం జిల్లా పెనుకొండ మండలం యర్రమంచిలో కియా మోటార్స్ ఆర్వోబీ, వై జంక్షన్ ఏర్పాటుకు 5.89 ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయింపు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి గ్రామంలోనే ట్రక్ టెర్మినల్, రైల్వే సైడింగ్ ఏర్పాటుకు 5 ఎకరాలు కేటాయింపు.
► విశాఖ జిల్లా పాడేరు ఏరియా ఆసుపత్రి 100 పడకల స్థాయి నుంచి 200 పడకల జిల్లా ఆస్పత్రి స్థాయికి పెంపు.
► ల్యాండ్ హబ్(భూసేవ) ప్రాజెక్టు నిమిత్తం అవసరమైన సిబ్బందిని అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు అంగీకారం.
► కృష్ణా జిల్లా నిమ్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం.
► చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కోటాలలో రూ.191.19 లక్షల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి ఆమోదం.
► నంద్యాలలో ప్రస్తుతమున్న 200 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నతీకరణ ప్రతిపాదనకు ఆమోదం. మొత్తం 46 పోస్టులు మంజూరు.
ఉద్యోగులకు 20 శాతం ఐఆర్
Published Sat, Feb 9 2019 2:45 AM | Last Updated on Sat, Feb 9 2019 2:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment