328వ రోజు పాదయాత్ర డైరీ | 328th day padayatra diary | Sakshi
Sakshi News home page

328వ రోజు పాదయాత్ర డైరీ

Published Sun, Dec 23 2018 2:47 AM | Last Updated on Sun, Dec 23 2018 9:03 AM

328th day padayatra diary - Sakshi

ఇప్పటివరకు నడిచిన దూరం:  3,505.6  కిలోమీటర్లు
22–12–2018, శనివారం 
గూడెం, శ్రీకాకుళం జిల్లా  

పేదలకు అందాల్సిన పరిహారాన్ని సైతం దోచుకోవాలనుకుంటున్న ఈ పెద్దలను ఏమనాలి?
ప్రజలతో మమేకమై నడుస్తుంటే.. వేల కిలోమీటర్లు కూడా పెద్ద దూరం అనిపించడం లేదు. అప్పుడే 3,500 కిలోమీటర్లు పూర్తయిందా? అనిపించింది. అందుకు గుర్తుగా రావివలస వద్ద ఓ మామిడి మొక్కను నాటించారు.
 
ఇక్కడికి అతి సమీపంలోనే తేలినీలాపురం పక్షుల కేంద్రం ఉంది. ఏటా పెలికాన్‌ పక్షులు, రంగుల కొంగలు పెయింటెడ్‌ స్టోర్క్స్‌ వేలాదిగా సైబీరియా నుంచి వేలమైళ్లు దాటి వస్తాయి. కనువిందు చేస్తాయి. అవి వస్తేనే సుభిక్షంగా ఉంటామని ఇక్కడి రైతన్నలు ప్రగాఢంగా విశ్వసిస్తారట. వాటిని ఇంటి ఆడబిడ్డలుగా గ్రామస్తులు చూసుకుంటారట. ఆ పక్షులకూ పెద్ద కష్టం వచ్చిపడింది. తిత్లీ తుపాను దెబ్బకు వందల ఏళ్ల నాటి వృక్షాలు సైతం నేలకొరగడంతో ఆవాసాలు కోల్పోయిన ఆ పక్షుల దీనస్థితిని చూసి గ్రామస్తులు విలవిల్లాడుతున్నారు. 

జయకృష్ణాపురానికి చెందిన సత్తార్‌ వేణుగోపాల్‌కు నాన్నగారంటే ప్రాణం. నాన్నగారి పాదయాత్రలోనూ ఆయన పాల్గొన్నాడు. నాన్నగారు చనిపోయినప్పుడు సొంత తండ్రిని కోల్పోయినట్టు తల్లడిల్లిపోయాడట. సంప్రదాయబద్ధంగా కర్మకాండలూ నిర్వహించాడట. ఏటా నాన్నగారి వర్ధంతి రోజున పిండప్రదానం చేసి, వందలాది మందికి భోజనాలు పెడుతున్నాడట. ఈ రోజు పాదయాత్రలో నన్ను కలిసిన ఆ సోదరుడు.. నాన్నగారితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ నాలుగేళ్లలో గుండె జబ్బుతో అన్నను, తల్లిని కోల్పోయాడు. భార్య సైతం కేన్సర్‌తో మరణించింది. వైద్యానికే లక్షలాది రూపాయల అప్పులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. నాన్నగారి హయాంలోలా ఆరోగ్యశ్రీ వర్తించి ఉంటే బాగుండేదంటూ బావురుమన్నాడు.  

రావివలస వద్ద.. మూతపడ్డ ఫెర్రో అల్లాయ్‌ ఫ్యాక్టరీ కార్మికులు కలిశారు. రెండేళ్లుగా జీతాల్లేక, బకాయిలు రాక, ఆ కుటుంబాలు పడుతున్న బాధ వర్ణనాతీతం. 28 ఏళ్ల ఆ ఫ్యాక్టరీ చరిత్రలో రెండుసార్లు మూతపడితే.. రెండుసార్లూ బాబుగారే ముఖ్యమంత్రి. రెండేళ్ల కిందట ఆ ఫ్యాక్టరీ పూర్తిగా మూతపడే సమయానికి కార్మిక మంత్రిగా ఉన్నది స్థానిక ఎమ్మెల్యేనే కావడం గమనార్హం. సొంత నియోజకవర్గ కార్మికులను ఆదుకోవాల్సిందిపోయి.. దగ్గరుండి ద్రోహం చేశారని ఆ సోదరులు వాపోయారు. నాన్నగారు ముఖ్యమంత్రి కాగానే.. అంతకు మునుపు బాబుగారు ఇబ్బడి ముబ్బడిగా పెంచిన కరెంటు చార్జీలను తగ్గించి, మూతపడ్డ ఫ్యాక్టరీలను తెరిపించారు. ఆ చేయూత వల్లనే.. బాబుగారి పాలనలో ఆరు ఫ్యాక్టరీలుంటే, నాన్నగారి హయాంలో 32 అయ్యాయని గుర్తుచేసుకున్నారు. మళ్లీ 2014లో బాబుగారు వచ్చాక అవన్నీ మూతపడ్డాయని ఆ సోదరులు చెబుతుంటే చాలా బాధేసింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడటానికి ఏకైక కారణం బాబుగారేనని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆ సోదరులకు మంచి రోజులొస్తాయని భరోసా ఇచ్చాను. 

నందిగం మండలానికి చెందిన నడుపూరు శ్యామల, చిన్ని జోగారావు, తమిరే దేవేందర్‌ తదితర తాజా మాజీ సర్పంచులు కలిశారు. ఈ ప్రభుత్వం వచ్చాక 26 మంది సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ తీసేశారట. మండలం మొత్తానికి హార్టీకల్చర్‌ ఉన్నదే 1690 ఎకరాల్లో అయితే.. దాదాపు 2,700 ఎకరాల్లో కొబ్బరి, మామిడి జీడి తోటలు దెబ్బతిన్నట్టు.. పరిహారం కోసం పచ్చ నేతలు రాయించారట. మంత్రిగారి సమీప బంధువుకు సంతోషపురంలో రెండున్నర ఎకరాల భూమి ఉందట. అది ఖాళీ భూమి. ఒక్క చెట్టూ లేదు. కానీ 4.95 ఎకరాల్లో వరి దెబ్బతిందని పరిహారం కోసం రాయించారట. ఆశ్చర్యమేంటంటే అదే భూమిలో మామిడి, జీడి తోటలు దెబ్బతిన్నట్టు మరో నివేదిక రాయించారట. తుపానుకు సర్వం కోల్పోయి విలవిల్లాడుతున్న పేదలకు అందాల్సిన పరిహారాన్ని సైతం దోచుకోవాలనుకుంటున్న ఈ పెద్దలను ఏమనాలి?  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఆముదాలవలస షుగర్‌ ఫ్యాక్టరీ మొదలుకుని.. జిల్లాలోని జూట్‌ మిల్లులు, ఫెర్రో అల్లాయ్‌ ఫ్యాక్టరీల వరకు మీ హయాంలోనే మూతబడటం వాస్తవం కాదా? దానికి కారణం మీరేనని కార్మికులు వాపోతున్నారు. ఓ వైపు.. ఉన్న పరిశ్రమలు మీ వల్లే మూతపడుతుంటే, మీరేమో.. శ్రీకాకుళానికి కొత్తకొత్త పరిశ్రమలు తెస్తానని, ప్రపంచం మొత్తం.. పెట్టుబడులు పెట్టాలంటే శ్రీకాకుళం వచ్చేట్టుగా ఏర్పాటుచేస్తానని మీ ధర్మపోరాట సభలో చెప్పడం.. ఎన్నికలకు మూడు నెలల ముందు ప్రజల్ని మభ్యపెట్టి మోసపుచ్చడానికే కాదా?  
- వైఎస్‌ జగన్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement