విజయనగరం అర్బన్ : ఓట్ల కోసం టీడీపీ ఇచ్చిన బూటకపు హామీలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. రుణమాఫీ వ్యవహారాలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం వల్ల రైతులు భారీ స్థాయిలో వడ్డీ భారం మోయనున్నారు. పొదుపు మహిళల రణాలు మాఫీ కాకపోవడం వల్ల భారీవడ్డీని భ రించాల్సి వస్తోంది. మోసపోయిన వారి జాబితా లో ఇప్పుడు బీఈడీ నిరుద్యోగులు వం తు వచ్చింది. ఆరుమాసాల ఆలస్యంగా గురువారం విడుదల చేసిన డీఎస్సీ-2014 షెడ్యూల్‌లో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులుగా ప్రకటించారు. దీంతో బీఈడీ అభ్యర్థుల ఆశలు నీరుగారిపోయాయి. జాతీయ వృత్తి విద్యా మండలి (ఎన్‌సీఈఆర్టీ) నిబంధనల మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు అర్హత కోల్పోయిన బీఈడీ అభ్యర్థుల ఓట్లుకోసం ఎన్నికల్లో గాలాం వేశారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే బీఈడీలకు ఎస్జీటీ పోస్టుల ఎంపికలో అర్హతని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఎన్నిక మ్యానిఫెస్టోలో కూడా పొందుపరిచారు. ప్రభుత్వం విడుదల చేయబోతున్న డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఎస్జీటీ పోస్టుకు పోటీపడేందుకు తమకూ అవకాశం దక్కుతుందని ఆశతో ఎదురు చూసిన బీఈడీ పట్టభద్రులకు ఇప్పుడు నిరాశే ఎదురయింది. గత డీఎస్సీ మాదిరిగానే ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ మాత్రమే అర్హులని తాజాగా షెడ్యూల్‌లో తేల్చిచెప్పారు. ఎన్‌సీఈఆర్టీ నిబంధనలను కనీసం తెలుసుకోకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పాదయాత్రలో ఎస్జీటీలుగా అకాశం కల్పిస్తామని బీఈడీలకు హామీ ఇచ్చి... తర్వాత దానిని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు.
అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది బీఈడీ నిరుద్యోగులు ఉండడంతో వీరందర్నీ ఓట్లు కోణంలో చూసిన చంద్రబాబు ఈ హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రావడంతో తమ కిచ్చిన హామీ చంద్రబాబు నెరవేరుస్తారని బీఈడీ అభ్యర్థులు ఆశపడ్డారు. ఆరుమాసాలుగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా అప్పులు చేసి వేల రూపాయలు ఫీజులుకట్టి శిక్షణ తీసుకున్నారు. జిల్లాలో ఎస్జీటీ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న బీఈడీ అభ్యర్థులు 15 వేల మంది ఉంటారని అంచనా. తాజాగా విడుదల చేసిన డీఎస్సీ-2014 షెడ్యూల్‌లో ప్రకటించిన జిల్లా ఖాళీలలోని 384 పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 249, పీఈటీలు-03, పండిట్స్-31 మినహాయిస్తే కేవలం 101 పోస్టులు మాత్రమే బీఈడీ అర్హతగల స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులున్నాయి. వాటిలో కొన్ని సబ్జెక్టుల పోస్టులు సింగిల్ నంబర్‌లో ఉన్నాయి. దీంతో ఈ షెడ్యూల్‌లో తమకు దగా జరిగిందని బీఈడీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా విద్యాశాఖ పంపిన ఖాళీ పోస్టులు 435
డీఎస్సీ-2014 నోటిఫికేషన్ కోసం జిల్లా నుంచి విద్యాశాఖ పంపిన ఖాళీ పోస్టులు 435 వరకు ఉన్నాయి. కేటగిరి వారీగా వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు 283. వీటిలో మైదాన ప్రాంతానికి 218, ఏజెన్సీ ప్రాంతానికి 65 పోస్టులున్నాయి. మిగిలిన 152 స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో సబ్జెక్టుల వారీగా మైదాన ప్రాంతం పోస్టులలో లెక్కలు-17, ఫిజికల్ సైన్స్-08, సోషల్ స్టడీస్-51, ఇంగ్లిష్-07, తెలుగు-17 ఉన్నాయి.
భాషాపండిత (ఎల్పీ) పోస్టులు హిందీ-14, తెలుగు-21, ఒడియా-02, సంస్కృతం-01, పీఈటీలు-07 ఉన్నాయి. ఏజన్సీ ప్రాంతంలో స్కూల్ అసిస్టెంట్ టీచర్లు ఇంగ్లిష్-02, లెక్కలు-01, ఎల్పీ పోస్టులు-04 (బ్లాక్‌లాగ్) ఉన్నట్లు డీఈఓ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
అయితే ప్రభుత్వం గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కేవలం 362 పోస్టులు మాత్రమే ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఉన్న ఖాళీలను కూడా కుదించి భర్తీ చేస్తున్నట్లు తేలింది.
‘బీఈడీ’ల ఆశలపై నీళ్లు
Published Fri, Nov 21 2014 12:49 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement