లింబో స్కేటింగ్‌లో 4 గిన్నిస్ రికార్డులు నమోదు
పిన్న వయసులోనే నమోదు చేసిన దేవీశ్రీ ప్రసాద్
ఏఎన్‌యూ: లింబో స్కేటింగ్‌లో ఒకేసారి నాలుగు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వెనుక రామకృష్ణ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రాంగణంలో గురువారం ఉదయం జరిగిన గిన్నీస్ రికార్డు ప్రదర్శనలో తిరుపతికి చెందిన పదేళ్ల బాలుడు జి.దేవీశ్రీ ప్రసాద్ ఈ రికార్డులను నమోదు చేశాడు. లింబో స్కేటింగ్‌లో దేవీశ్రీ ప్రసాద్ 115.6 మీటర్ల పొడవులో అమర్చిన 60 రేనాల్ట్ డస్టర్ కార్ల కిందుగా ముందుకు విజయవంతంగా స్కేటింగ్ చేసి ఒక రికార్డును నెలకొల్పాడు.
అలాగే 115.6 మీటర్ల పొడవులో 60 రేనాల్ట్ డస్టర్ వాహనాల కిందుగా వెనుకకు స్కేటింగ్ చేసి మరో రికార్డును నమోదు చేశాడు. దీంతో పాటు 10 అంగుళాల ఎత్తు ఉన్న అండర్ బార్‌ల కింద నుంచి 184 మీటర్ల పొడవు ముందుకు విజయవంతంగా స్కేటింగ్ చేసి రికార్డును నమోదు చేశాడు. 10 అంగుళాల ఎత్తు ఉన్న అండర్ బార్‌ల కింద నుంచి వెనుకకు 167 మీటర్లు పొడవు స్కేటింగ్ చేసి మరో రికార్డును నెలకొల్పాడు.